Congress | హైదరాబాద్, జనవరి 23(నమస్తే తెలంగాణ): నాలుగు పథకాల అమలు కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలు కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతున్నాయి. ఈ వ్యవహారం పార్టీ ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రులుగా మారింది. గ్రామసభల నిర్వహణ, అర్హుల ఎంపిక విధానంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే భగ్గుమంటున్నారు. గ్రామసభలేంది? దరఖాస్తుల గోల ఏంది? అంటూ మంత్రులను నిలదీస్తున్నారు. బుధవారం రాత్రి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, మెజా ర్టీ ఎమ్మెల్యేలు గ్రామసభల నిర్వహణ, అర్హుల ఎంపికపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రతిపక్ష ఎమ్మెల్యేల మాదిరిగా ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది.
దీంతో విసుగుచెందిన మంత్రి ఉత్తమ్ ‘ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పక్కనపెట్టండి.. మీకు ఇష్టం వచ్చినట్టు చేయండి’ అంటూ ఎమ్మెల్యేలకు చెప్పినట్టు సమాచారం. ఒక్క ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాతమే కాదు.. దాదాపు మంత్రులందరి పరిస్థితి ఇదే విధంగా ఉన్నది. ప్రతిచోటా మంత్రులను నిలదీస్తున్నట్టు తెలిసింది. ‘దావోస్, ఢిల్లీ, బెల్గాంకు తిరుగుతూ మీరంతా బాగానే ఉన్నరు.. మీరు పెట్టిన పెంటకు క్షేత్రస్థాయిలో మేం బలవుతున్నాం’ అంటూ ఒక ఎమ్మెల్యే ఘాటుగానే వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ‘పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో వచ్చి చూడండి’ అని సదరు ఎమ్మెల్యే కోపంగా అన్నట్టు సమాచారం.
గ్రామసభల ద్వారా అర్హులను ఎంపిక చేయాలన్న ప్రభుత్వ ఆలోచన బెడిసికొట్టింది. ప్రచారం కోసం ప్రయత్నిస్తే.. అది రివర్సై వ్యతిరేకత పెంచుతున్నది. అర్హుల పేర్లు జాబితాలో ఉండటం లేదు. దీంతో ప్రజలు అధికారులను, కాంగ్రెస్ కార్యకర్తలను, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. గ్రామసభలన్నీ రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఈ సెగ ఎమ్మెల్యేలకు తాకింది. ప్రజలు, కార్యకర్తల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండటంతో ఎమ్మెల్యేలంతా ప్రస్ట్రేషన్‌కు గురవుతున్నట్టు తెలిసింది.
గ్రామసభలు ఎందుకు పెడుతున్నరు? మళ్లీ మళ్లీ దరఖాస్తులు ఎందుకు తీసుకుంటున్నరు? అంటూ సొంత ప్రభుత్వ తీరుపైనే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నట్టు సమాచారం. ప్రజాపాలనలో దరఖాస్తులు, కుటుంబ సర్వేలో తీసుకున్న వివరాలు ఏమాయ్యాయంటూ నిలదీస్తున్నారు. గత వివరాల ప్రకారం అర్హులకు ఎంపిక చేసి పథకాలు అమలు చేస్తే బాగుండేదని, సభలు, దరఖాస్తుల పేరుతో రచ్చకు తెరతీశారంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదంతా తమ కొంప ముంచేందుకేనంటూ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డుల జారీకి సంబంధించి అర్హుల ఎంపిక ప్రక్రియ మొత్తం హైదరాబాద్ నుంచే కొనసాగుతున్నది. ప్రజాపాలన, కులగణనలో సేకరించిన వివరాలతో సాంకేతికత ఆధారంగా అర్హుల జాబితాను రూపొందించి క్షేత్రస్థాయికి పంపిస్తున్నారు. ఈ జాబితాను గ్రామసభలో పెట్టి మరోసారి అర్హులను గుర్తిస్తున్నారు. అంతేగాని గ్రామసభల్లో కొత్త జాబితాను రూపొందించే, కొత్తవారిని చేర్చే అవకాశం లేదు. ఎమ్మెల్యేలకు కూడా ఈ అధికారం లేదు.
దీంతో ఎమ్మెల్యేలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ‘పథకాలు ఎవరికివ్వాలో మీరే తేల్చితే ఇక మేమెందుకు? పథకాల అమలు మీ ఇష్ట ప్రకారమే జరిగితే మేం ఎమ్మెల్యేలుగా ఉండి ఎందుకు? పార్టీ కోసం పనిచేసినవారికి, కార్యకర్తలకు, మా వద్దకు వచ్చే నిరుపేదలకు కూడా సహాయం చేయలేకపోతున్నాం. ఎవరికీ మేలు చేయనప్పుడు మేము ఎమ్మెల్యేలుగా ఉండెందుకు, ఈ పదవి ఎందుకు?’ అంటూ ఎమ్మెల్యేలు ఆగ్ర హం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా కార్యకర్తలకు మొఖం చూపించుకోలేకపోతున్నామని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తంచేస్తున్నట్టు తెలిసింది.
పథకాల అమలు కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. పథకాలిచ్చి ప్రయోజనం పొందాల్సిందిపోయి, వ్యతిరేకత మూటగట్టుకుంటున్నామని, దీంతో త్వరలో జరిగే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఈ వ్యతిరేకత ప్రభావం చూపడం పక్కా అని చెప్తున్నారు. జాబితాల్లో తప్పులతో అర్హులకు అన్యాయం జరుగుతున్నదని మండిపడుతున్నారు.
దరఖాస్తులు, వడపోతలతో ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని, ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్థ విధానాలతో సొంత పార్టీ కార్యకర్తలకు కూడా న్యాయం జరగడం లేదని వాపోతున్నారు. ఎన్నో ఏండ్లుగా పార్టీ కోసం పనిచేసినవారికి కనీసం రేషన్‌కార్డు కూడా ఇప్పించుకోలేని పరిస్థితి నెలకొన్నదని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.