స్పెషల్టాస్క్బ్యూరో/ హైదరాబాద్, మే 9(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం మరోసారి బట్టబయలైంది. సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నా, ఏకంగా పోక్సో కేసు నమోదైనా కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు కనీసం స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఘటన వెలుగులోకి వచ్చి రెండు రోజులవుతున్నా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు ఎవ్వరూ స్పందించలేదు. ఎవరికి వారు గప్‌చుప్‌గా ఉన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షుడు ఇలా ఎవరూ స్పందించలేదు. కనీసం బాధితురాలికి అండగా నిలుస్తామనే ప్రకటన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కానీ, పార్టీ నుంచి కానీ వెలువడలేదు.
బండిపై చెలరేగిన ఢిల్లీ అధిష్ఠానం
బండి సంజయ్ కుమారుడి వ్యవహారంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ ముఖ్యనేతలు మౌనంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం ఈ వివాదాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నది. ఎక్స్ వేదికగా వరుసగా పోస్టులు పెట్టింది. . ఒక ట్వీట్లో ప్రధాని మోదీకి ఇష్టమైన మంత్రి బండి సంజయ్ కుమారుడు ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆయనపై పోక్సో కేసు నమోదైందని పేర్కొన్నది. ఈ వి వాదం బయటకు రాకుండా భగీరథ్ అధికార జులుం ప్రదర్శిస్తూ ఆమెను కొట్టాడాని, బెదిరించాడని ఆగ్రహం వ్యక్తంచేసింది. భగీరథ్ వ్యక్తిత్వమే బీజేపీ అసలు రూపమని తీవ్రంగా విమర్శించింది. బండి సంజయ్ కుమారుడి అకృత్యాలపై ప్రత్యేక వీడియోను కూడా పోస్టు చేసింది. ఇలా వరుసగా మూడు ట్వీట్లు చేస్తూ బండి సంజయ్ కుమారుడి అఘాయిత్యాలు, అరాచకాలను దేశ వ్యాప్తంగా చర్చకు పెట్టింది.
కిక్కురుమనని రాష్ట్ర కాంగ్రెస్
ఒకవైపు ఢిల్లీ అధిష్ఠానం ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నా, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మాత్రం కిక్కురుమనలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొదలుకొని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు, ఇతర కీలక నేతలెవరూ మాట కూడా మాట్లాడలేదు. ముందుగా స్పందించాల్సిన రాష్ట్ర నేతలు మౌనంగా ఉండటం వెనుక అంతరార్ధం ఏమిటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీతో ఉన్న బంధం కారణంగానే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ వార్త రాకుండా అధికార పార్టీ నాయకులు , ఒత్తిళ్లకు కూడా గురిచేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.బీజేపీ,
కాంగ్రెస్‌ది ఫెవికాల్ బంధమే!
బండి సంజయ్ కుమారుడి ఉదంతంతో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య దృఢమైన ఫెవికాల్ బంధం ఉన్నదనే విషయం బహిర్గతమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. బండి భగీరథ్‌పై వస్తున్న లైంగిక దాడి ఆరోపణలపై స్థానిక కాంగ్రెస్ నాయకత్వం స్పందించకపోవడం విస్మయానికి గురి చేస్తున్నది. నిజానికి ఈ విషయం సోషల్ మీడియాలో శుక్రవారం రాత్రే గుప్పుమన్నది. అయితే, 24 గంటలు గడిచిన తర్వాత కూడా స్థానిక కాంగ్రెస్ నేతలు గానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా మంత్రులు కానీ ఏ మాత్రం స్పందించలేదు. నిందితుడిని కఠినంగా శిక్షించి, బాలికకు న్యాయం చేయాలంటూ ఒకవైపు కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నా, కాంగ్రెస్ నాయకులు నోరెత్తకపోవడం గమనార్హం. చివరికి జాతీయ కాంగ్రెస్ తన ఎక్స్ ఖాతాలో శనివారం సాయంత్రం 4.10 గంటలకు బండి కొడుకు బాగోతంపై స్పందిస్తూ.. బీజేపీ తీరును ఎండగట్టింది. ఆ తర్వాత మేల్కొన్న తెలంగాణ కాంగ్రెస్.. తప్పనిసరి పరిస్థితుల్లో మొక్కుబడిగా ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేసింది. దీన్నిబట్టి స్థానిక కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం ఉన్నట్టు అభిప్రాయపడుతున్నారు.