నెన్నెల, జూన్ 6: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికల అక్రమాలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలతో అవకతవకలు రచ్చకెక్కుతున్నాయి. కాంగ్రెస్ నేతలు తమకు నచ్చినవాళ్లకే ఇండ్లు ఇచ్చుకుంటున్నారన్న ప్రతిపక్షాలు, దరఖాస్తుదారుల ఆరోపణలకు అధికారపార్టీ నేతల మధ్య విభేదాలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయచి చర్చ నడుస్తున్నది. తాజాగా మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జండావెంకటాపూర్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక వ్యవహారంపై రచ్చ జరిగింది. గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గొగు సుధాకర్ భూసమస్య గురించి చెప్పుకునేందుకు తన తండ్రితో కలిసి వచ్చాడు.
అదే సమయంలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ జనగాం తిరుపతి, అతని అనుచరులు అక్కడికి చేరుకున్నారు. ఇరువురి మధ్య ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ వ్యవహారం చర్చకు వచ్చింది. భూములు, ఇండ్లు ఉన్నవారికే ఇండ్లు ఇస్తున్నారని, లేనోళ్లకు ఎందుకు ఇవ్వడంలేదని అక్కడున్న నాయకులను సుధాకర్ ప్రశ్నించాడు. దీంతో తిరుపతి, సుధాకర్ మధ్య మాటామాటా పెరిగింది. ఒకరినొకరు తోసుకొని పిడిగుద్దులతో ఘర్షణకు దిగారు. ఈ దాడిలో సుధాకర్‌కు గాయాలు కాగా, బెల్లంపల్లి హాస్పిటల్‌కు తరలించారు. తిరుపతి, అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని సుధాకర్ తెలిపారు.