Meenakshi Natarajan | సంగారెడ్డి, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ)/అందోల్/ పరిగి : పాదయాత్ర అంటే ఏం చేస్తారు? ప్రజలను కలుస్తూ.. వారితో మాట్లాడుతూ కష్టసుఖాలు తెలుసుకుంటారు. బాధల్లో ఉన్నవాళ్లకు భరోసా ఇస్తారు.. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పాద్రయాత్రలో అవేవీ ఎక్కడా కనిపించలేదు. సంగారెడ్డి జిల్లా అందోల్‌లో శుక్రవారం కొనసాగిన మీనాక్షి యాత్ర ఆద్యంతం నిరాసక్తిగా సాగింది. ప్రజలను, కార్యకర్తలను కలిసేందుకు అంటూ చేపట్టిన ఈ పాదయాత్రలో ఆ ఊసే లేకుండా పోయింది. కట్టుదిట్టమైన పోలీసుల వలయం మధ్య పాదయ్రాత కొనసాగింది. సంగుపేట నుంచి జోగిపేట వరకు ఆరు కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో మీనాక్షి ఒక్కసారి కూడా జనం వైపు కన్నెత్తి చూడలేదు. పార్టీ కార్యకర్తలను కూడా కలవలేదు. తల ఎత్తకుండా వేసిన అడుగు ఆపకుండా వేగంగా నడుస్తూ వెళ్లిపోయారు. పాదయాత్రకు ముందే నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
కార్యకర్తలు ప్రయత్నించినా కలవలే
మీనాక్షిని కలిసేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించినా పోలీసుల వలయాన్ని దాటకుని వెళ్లలేకపోయారు. కార్యక్రమం తీరుపై కాంగ్రెస్ శ్రేణులే పెదవి విరుస్తున్నారు. మీనాక్షి, మహేశ్‌గౌడ్ కనీసం జిల్లా నాయకులు. కార్యకర్తలను కూడా కలవలేదని ఇదేం తీరని మండిపడుతున్నారు. కాగా మీనాక్షి సెంట్రిక్‌గా ప్రారంభమైన పాదయాత్రలో అందోల్ దాటిన తర్వాత ఆమెను వెనక్కి నెట్టి మహేశ్‌కుమార్‌గౌడ్ ముందుకు సాగారు. మంత్రి దామోదర సైతం మీనాక్షి కంటే ముందుకు సాగిపోయారు. పాదయాత్రను కనీసం చూసేందుకు కూడా ఎక్కడా ప్రజలు ఆసక్తిచూపలేదు. మీనాక్షి పాదయాత్ర హైవేలపైనే సాగడం, ప్రజలు, పార్టీ కార్యకర్తలతో మాట్లాడకపోవడం, రోడ్డుపై నిలబడిన కార్యకర్తలను సైతం పోలీసులు తోసేయడంతో క్యాడర్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
సభ వెలవెల
జోగిపేటలో జరిగిన మీనాక్షి జనహిత సభ జనం లేక వెలవెలబోయింది. హనుమాన్ చౌరస్తాకు పాదయాత్ర చేరుకున్న అనంతరం జనహిత సభ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మీనాక్షి, మహేశ్‌గౌడ్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలను సమీకరిస్తారని కాంగ్రెస్ నాయకులు చెప్పినా అక్కడ విరుద్ధ పరిస్థితి కనిపించింది. నటరాజన్ సహా ముఖ్యనేతలు, మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల గురించి కాకుండా బీఆర్ఎస్ లక్ష్యంగా ఆరోపణలు చేశారు. సభలో ప్రసంగించిన నేతలెవరూ సీఎం రేవంత్‌రెడ్డి పేరే ఎత్తలేదు. మహేశ్‌గౌడ్ ఒక్కరే ప్రస్తావించారు. దామోదర మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ‘దామోదర్ సీఎం..సీఎం’ అంటూ నినాదాలు చేశారు.