జైపూర్, నవంబర్ 6 : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో డీఎంఎఫ్టీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు బుధవారం భూమిపూజ చేసేందుకు వచ్చిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి(MLA Vivek) ముందే కాంగ్రెస్ నాయకులు(Congress leaders) బాహాబాహీకి దిగారు. అభివృద్ధి కార్యక్రమానికి ఎమ్మెల్యే వస్తున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫయాజ్ స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు సమాచారం ఇవ్వలేదని జక్కుల వెంకటేశం వివేక్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై ఫయాజ్ స్పందిస్తూ తనపై వ్యక్తిగతంగా కక్ష్య గట్టి కార్యక్రమాన్ని ఫెయిల్ చేద్దామని గొడవ సృష్టించినట్లు ఆరోపించాడు. తాను నాయకులందరికీ వాట్సప్ ద్వారా, పర్సనల్‌గా మెసేజ్ చేశానని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇరు నాయకులు ఒకరినొకరు దూషించుకున్నారు. దీంతో ఇరు గ్రూపుల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు అడ్డుకున్నారు. గొడవ విషయంపై అసహనం వ్యక్తం చేసిన వివేక్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో మరో కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ తిరిగి వెళ్లిపోయారు. అంతకు ముందు నర్వ గ్రామంలో డీఎంఎఫ్టీ నిధుల ద్వారా నిర్మించనున్న సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్ పనులకు భూమి పూజ చేశారు.