10 hp motor | ఎద్దు తెల్వదు.. ఎవుసం తెల్వదు మోట తెల్వదు.. మోటర్ తెల్వదు తెలంగాణలో సాధారణంగా రైతులు వాడేది 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్లే. కానీ మ్యాటర్, మీటరు తెల్వని కాంగ్రెస్ మేధావులు మాత్రం మన రైతులు 10హెచ్‌పీ పంప్సెట్లు వాడుతారని అజ్ఞాన ప్రదర్శనకు దిగుతున్నారు. ఒకవైపు 3గంటల కరెంట్ చాలు అంటూనే, మరోవైపు 10హెచ్‌పీ మోటర్లు వాడాలంటున్నరు.
తెలంగాణలో సుమారు 28లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉంటే, అన్నీ 3హెచ్‌పీ, 5 హెచ్‌పీ మాత్రమే. ఒకవేళ సాగుకు 10హెచ్‌పీ మోటర్ పెట్టుకోవాలంటే 29వేల కోట్లు అవసరం. సామాన్య రైతులు పెట్టలేనంత ఖర్చు అది. అంత డబ్బు ఎవరిస్తారు?
ఒకవేళ 10హెచ్‌పీ మోటర్ పెట్టినా.. తోడేందుకు సరిపడా భూమిలో నీళ్లుండాలి. మోటర్ మార్చినా వాటర్ పెరుగకపోతే ఏం ఫాయిదా? సాగుకు 3గంటల కరెంటు చాలంటున్న కాంగ్రెస్.. మరి 10హెచ్‌పీ మోటరుకు ఏ మూడు గంటలపాటు ఇస్తారు? పగలా, రాత్రా? పట్టపగలు కరెంటుకు పీక్డిమాండ్.. రాత్రివేళ నీళ్లుపారిచ్చుడు ప్రాణాపాయమే. ఇట్లుంటది కాంగ్రెస్‌తోటి!
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగంపై తమకు కనీస అవగాహన లేదని కాంగ్రెస్ నేతలు మరోసారి నిరూపించుకొన్నారు. పంట పండించటానికి ఒక రైతు ఎంత కష్టపడుతాడు? ఎంత కరెంటు వాడుతాడు? ఎలాంటి పంపులు వాడుతాడు? ఎలాంటి పంటలు వేస్తాడు? నీటి వసతి సంగతేంది? భూగర్భ జలాలను ఎలా వాడుకొంటాడు? అనే అంశాలపై తమ పరిజ్ఞానం సున్నా అని చెప్పకనే చెప్పుకొన్నారు.
వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రైతు లోకం తిరగబడటంతో ఇప్పుడు కొత్తరాగం ఎత్తుకొన్నారు. బావులు, బోర్లకు 10 హెచ్‌పీ మోటర్లు బిగించుకొంటే మూడుగంటల్లో పొలం పారుతుందని, అలాంటప్పుడు మూడు గంటల కరెంటు సరిపోతుంది కదా? అని ఓ సచ్చు సలహా ఇచ్చారు. 10 హెచ్‌పీ మోటర్లు ఎక్కడ వాడుతారో కూడా తెలియని అజ్ఞానంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని రైతులు నవ్వుకొంటున్నారు. సాగు గురించి తెలిసిన ఏ నేత కూడా ఇలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడరని మండిపడుతున్నారు.
భూగర్భ జలాల సంగతేంది?
పదేండ్ల కిందటి వరకు కూడా మన రాష్ట్రలో బావులు, బోరు బావులకు 3 హెచ్‌పీ మోటర్లనే వాడేవారు. ఆ తర్వాత 5 హెచ్‌పీకి మారారు. ఈ మోటర్లు భూగర్భం నుంచి నీటిని ఒకేసారి కాకుండా ఒక ధారగా బయటకు తీసుకొస్తాయి కాబట్టి పొలాలు సమృద్ధిగా తడుస్తాయి. భూగర్భ జలాలు లోపల భారీ వరదలా ఉండవు. చిన్న నీటి ఊటల్లా ఉంటాయి.
ఆ నీరు ఎంత ఊట ఉంటుందో అంతే స్థాయిలో రైతులు మోటర్లు వాడుతారు. దాంతో మోటర్ నిరంతరాయంగా నీటిని తోడుతుంది. కొన్ని సందర్భాల్లో నీటి ఊట తగ్గినా ఒకటిరెండు నిమిషాలపాటు ధార ఆగిపోయినా వెంటనే అందుకొంటుంది. అలా పోయటంవల్ల పొలం నలుమూలలా నీరు పారుతుంది. అదే బోరు బావికి 10 హెచ్‌పీ మోటర్ బిగిస్తే పది నిమిషాల్లో ఊటనంతా బయటకు పోస్తుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? మళ్లీ నీరు ఊరటానికి సమయం పడుతుంది.
ఆ తర్వాత మోటర్ మళ్లీ నీటిని తోడినా.. ముందు పారినంతవరకే పొలం పారుతుంది. ఎందుకంటే అప్పటికే మొదట తోడిన నీరు ఇంకిపోతుంది కాబట్టి.. ఈ విషయం రైతులకు బాగా తెలుసు. నీరు పుష్కలంగా ఉంటేనే 10 హెచ్‌పీ మోటర్తో ఉపయోగం. లేదంటే మొదటికే మోసం వస్తుంది. అందుకే బోర్లకు 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్లనే వాడుతారు. ఇవేవీ తెలియని కాంగ్రెస్ నేతలు.. తాము చేసిన తప్పులను సరిదిద్దుకొనేందుకు రైతులకు అడ్డదిడ్డమైన సలహాలు ఇస్తున్నారు.
మౌలిక, నిర్మాణ, పరిశ్రామిక రంగాల్లోనే..
నిజానికి 10 హెచ్‌పీ మోటర్లు మౌలిక, నిర్మాణ రంగాలతోపాటు.. పారిశ్రామిక రంగంలో ఎక్కువగా వాడుతుంటారు. తెలంగాణ వ్యాప్తంగా తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల్లో 10 హెచ్‌పీ, అంతకు మించిన సామర్థ్యం ఉండే పంపులను వాడుతున్నారు. నిర్మాణ రంగంలో.. పరిశ్రమల్లోనూ 10 హెచ్‌పీ మోటర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ రంగాల్లో ఉపయోగించే నీటి పరిమాణం ఎక్కువ. పైగా ఫోర్స్‌తో నీటిని పంపింగ్ చేసేందుకు 10 హెచ్‌పీ మోటర్ల ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. అలాగే గ్రౌండ్ వర్క్‌లో భాగంగా నీటి ఊటను ఎప్పటికప్పుడు పంపింగ్ చేసేందుకు 10 హెచ్‌పీ మోటారు పంపులను వాడుతుంటారు. ఇక పరిశ్రమల్లోనూ వీటిని విరివిగా వాడుతుంటారు. వ్యవసాయంలో 10 హెచ్‌పీ మోటర్లను వాడటం దాదాపు ఉండదనే చెప్పవచ్చు.
ఒక్కో పంపునకు రూ.లక్షకు పైగా భారం
కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్టుగా 10 హెచ్‌పీ పంపులను వాడటం రైతులకు మోయలేని భారంగా మారుతుంది. మార్కెట్లో లభించే నాణ్యమైన సీఆర్ఐ, టెక్స్మో, సముద్ర, లూబీ, ఎల్లెన్, కిర్లోస్కర్ లాంటి బ్రాండెడ్ 10 హెచ్‌పీ ఒక్కో పంపు సగటు ధర రూ. 45 వేల నుంచి రూ.50 వేల వరకు ఉన్నది. మోటర్‌కు తోడు.. పైపులు, క్లాంపులు, వైర్లు, డబ్బా, స్టార్టర్కు మరో రూ.50 వేలకుపైగా ఖర్చు అవుతుంది. ఒకవేళ బోరు లోతు ఎక్కువగా ఉంటే.. ఆ స్థాయిలో పైపులు, వైర్లకు ఖర్చు పెరుగుతుంది. ఈ లెక్కన సగటు ఖర్చును పరిగణనలోకి తీసుకున్నా ఒక్కో మోటర్‌కు రూ.లక్షకుపైగా రైతుపై భారం పడుతుంది.
3 గంటల కరెంటు ఎప్పుడిస్తారు?
వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అన్న కాంగ్రెస్ నేతలు.. అది ఏ సమయంలో ఇస్తారో చెప్పలేదు. ఇప్పుడు 10 హెచ్‌పీ మోటర్ పెట్టుకోవాలని చెప్తున్నారు. అంతపెద్ద మోటర్లు నడువాలంటే కరెంటు ఎక్కువగా అవసరం అవుతుంది. సాధారణంగా పగటి సమయంలో గృహ వినియోగంతోపాటు పారిశ్రామిక అవసరాలకు ఎక్కువ కరెంటు పోతుంది. ఇటువైపు డిమాండ్ అధికంగా ఉంటుంది కాబట్టి.. ఈ సమయంలో వ్యవసాయానికి 10 హెచ్‌పీ మోటర్ నడిచేంత కరెంటు ఇవ్వటం సాధ్యంకాదు. దీంతో అనివార్యంగా రాత్రిపూటనే వ్యవసాయానికి కాంగ్రెస్ చెప్తున్న మూడు గంటల కరెంటు ఇవ్వాలి. అప్పుడు మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలో ఎలాగైతే పాముకాట్లు, కరెంటు షాక్‌లతో రైతులు చనిపోయారో.. అలాంటి పరిస్థితులే వస్తాయి. ఇదీ కాంగ్రెస్ చేయదల్చుకొన్న గొప్ప పని.
బోరుబావికి 10 హెచ్‌పీ మోటర్ బిగిస్తే 10 నిమిషాల్లో ఊటనంతా బయటకు పోస్తుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? మళ్లీ నీరు ఊరడానికి సమయం పడుతుంది. ఆ తర్వాత మోటర్ మళ్లీ నీటిని తోడినా.. ముందు పారినంత వరకే పొలం పారుతుంది.
రూ.28 వేల కోట్లు కావాలి
‘10 హెచ్‌పీ మోటర్లంటే.. కొంపలు ముంచే యవ్వారమే’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా చెప్తున్నారు. అది యదార్థమేనని రైతులు అంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 27.93 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. ఇవన్నీ 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్ పంపులే. అక్కడక్కడ ఒకటీ అరా 7.5 హెచ్‌పీ పంపులున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్టుగా రైతులంతా 10 హెచ్‌పీకి అప్‌గ్రేడ్ కావాలంటే ఇప్పటికప్పుడు రైతులపై రూ.28,000 కోట్ల భారం పడుతుంది. ఒక్కో 10 హెచ్‌పీ పంపు సెట్‌కు రూ.లక్షకు పైగా అవుతుంది. ఇప్పుడు వాడుతున్న 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ పంపులను అమ్మినా వచ్చే డబ్బులు పల్లీ బఠానీల లాంటివే. సెకండ్ హ్యాండ్ పంపులను ఎవరూ కొనరు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే 27.93 లక్షల మోటారు పంపులకు రూ.28,000 కోట్లు అవసరమని నిపుణులు చెప్తున్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతులపై పడబోయే భారం 28,000 కోట్లు అని చెప్తున్నారు.