సత్తుపల్లి/పెనుబల్లి, జూన్ 7 : మద్యం మత్తులో ఓ హోటల్ వద్ద హంగామా సృష్టిస్తున్న ఓ కాంగ్రెస్ నాయకుడు, అతడి అనుచరులను అడ్డుకోబోయిన ఓ మహిళా ఎస్సై పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలోని తిరువూరు క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. ఖమ్మం సీపీ సునీల్‌దత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన రాయల రామారావు (రాము) తన అనుచరులతో కలిసి కల్లూరు పట్టణంలోని చౌదరి హోటల్‌కు వచ్చాడు. తనకు టిఫిన్ కావాలని హోటల్ యజమాని మాగంటి బోసుబాబును అడగ్గా.. లేదని చెప్పడంతో ఆగ్రహంతో రాము, అతడిఅనుచరులు హోటల్ యాజమాన్యం, సిబ్బందితో గొడవకు దిగారు. వెంటనే హోటల్ యజమాని కల్లూరు పోలీసులకు సమాచారం అందించాడు.
విచారణ నిమిత్తం ఎస్సై వస్తున్నారనే విషయం తెలుసుకున్న రాము తన అనుచరులతో మళ్లీ హోటల్ వద్దకు చేరుకున్నాడు. గొడవకు సాక్షులుగా ఉన్న హోటల్ సిబ్బంది, యజమానిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే హోటల్ నడవనివ్వనని బెదిరించాడు. ఈ క్రమంలో ఎస్సై తన సిబ్బందితో హోటల్ వద్దకు చేరుకోగా.. ఎస్సై ఎదురుగానే రాము, అతడి అనుచరులు మద్యం మత్తులో గొడవకు దిగారు.
వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో రాము, అతడి అనుచరులు మహిళా ఎస్సై విధులకు ఆటంకం కలిగిస్తూ ఆమె ఛాతీపై చెయ్యి వేసి నెట్టేశారు. దీంతో ఎస్సై ఫిర్యాదు మేరకు రాముతోపాటు మొత్తం 10 మందిపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు రాముతోపాటు ఏడుగురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్టు సీపీ సునీల్‌దత్ తెలిపారు. గతంలో కూడా రాముపై తల్లాడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందని పేర్కొన్నారు.