జనగామ రూరల్, ఫిబ్రవరి 28: సాగు నీళ్లు లేక పంట ఎండిపోయిందని.. ఇందుకు తనకు పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకుడు, రైతు నర్సయ్య.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విన్నవించాడు. జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని గానుగుపహాడ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు, రైతు రెడ్డబోయిన నర్సయ్య తన కష్టాలను వీడియోలో వెల్లడించాడు. తనకు రెండున్నర ఎకరాల భూమి ఉన్నదని, రెండు నెలల క్రితం బోరు వేసినా కొద్దిగా నీరు రావడంతో పొలం నాటుపెట్టినట్టు తెలిపాడు.
కానీ 15 రోజులుగా బోరు నుంచి నీరు రాకపోవడంతో పొలం ఎండిపోయిందని, ఇందుకుగాను రూ. 60 వేల నష్టం జరిగిందన్నాడు. ఎండిన పైరును జీవాలకు అమ్ముకున్నట్టు తెలిపాడు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి సాయం చేసి ఆదుకోవాలని వేడుకున్నాడు.