వరంగల్ ప్రతినిధి, జూలై 3 (నమస్తే తెలంగాణ)/గోవిందరావుపేట: ఇందిరమ్మ ఇండ్ల జాబితా నుంచి తన పేరును ఎందుకు తొలగించారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నేతలు సొంతపార్టీ కార్యకర్తనే బలిగొన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అధికార పార్టీ నేతలు, పోలీసులు కలిసి చేసిన దౌర్జన్యం కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిని దిగ్బంధించారు. మృతదేహంతో మూడుగంటలు బైఠాయించారు. ఈ అమానవీయ ఘటన మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన చుక్క రమేశ్ (29) ఉపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటున్నారు.
తల్లిదండ్రులు చుక్క గట్టయ్య, స్వరూప ఆయన చిన్నతనంలోనే మృతిచెందారు. దీంతో రమేశ్, అతడి చెల్లి అమ్మమ్మ శెట్టి విశాల దగ్గర పెరిగారు. రమేశ్ చెల్లికి నాలుగేండ్ల కిందట వివాహం జరిగింది. రమేశ్ ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా చల్వాయి గ్రామంలో విడుదల చేసిన లబ్ధిదారుల జాబితాలో రమేశ్ పేరు వచ్చింది. దీంతో సంతోషించి, రెండు నెలల కిందట గ్రామానికి వచ్చారు. ఇటీవల గ్రామంలో కాంగ్రెస్ నేతలు లబ్ధిదారులకు ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలు అందజేస్తూ శంకుస్థాపనలు చేస్తున్నారు. కానీ తనకు ప్రొసీడింగ్ కాపీ రాకపోవడంతో రమేశ్ ఆరాతీశారు.
మొదటి జాబితాలో ఉన్న తన పేరు రెండో జాబితాలో తొలగించినట్టు తెలుసుకొని కంగుతిన్నారు. దీంతో ‘చల్వాయి గ్రామ సమాచారం’ అనే వాట్సాప్ గ్రూప్‌లో పోస్టులు పెడుతూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. కొందరు నేతలు డబ్బులు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తున్నారని ఆరోపించారు. తాను సైతం కాంగ్రెస్ కార్యకర్తనేనని, అవసరమైతే అందరిలాగే ఇంటి కోసం డబ్బులిస్తానని, తనకు మంజూరు చేయాలని కాంగ్రెస్ నేతలను ప్రాదేయపడినట్టు స్థానికులు చెప్తున్నారు.
ఇటీవల హన్మకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ‘నాగన్న’ అనే పేరుతో మంత్రి సీతక్క, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌పై లేఖ విడుదల కాగా, అది సోషల్ మీడియాలో ప్రచారమైంది. ‘నమస్తే తెలంగాణ’ ఆ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనాల క్లిప్‌లను కూడా రమేశ్ ‘చల్వాయి సమాచారం’ వాట్సాప్ గ్రూప్‌లో బుధవారం ఉదయం పోస్ట్ చేసినట్టు స్థానికులు పేర్కొన్నారు.
‘చల్వాయి సమాచారం’ గ్రూప్‌లో రమేశ్ పెట్టిన పోస్టులపై స్థానిక కాంగ్రెస్ నేతలు ఆగ్రహించడంతో పాటు బెదిరింపులకు దిగారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ నేతల బెదిరింపులు ఎక్కువ కావడంతో, మంత్రి సీతక్క పేదలకు ఏమీ సాయం చేయలేదని, అడవిలో ఉన్నవారికి చేసిందే తప్ప తనకు ఏమీ చేయలేదని, తాను కూడా కాంగ్రెస్ నాయకుడినేని రమేశ్ పోస్టులు పెట్టారు. దీంతో మండిపడ్డ కాంగ్రెస్ నేతలు బుధవారం రాత్రి యువకుడి ఇంటికి వెళ్లి బెదిరించారు. అంతటితో ఆగకుండా స్థానిక ఎస్సై కి మౌఖికంగా ఫిర్యాదు చేశారు. దీంతో రమేశ్‌కు ఎస్సై ఫోన్‌చేసి బెదిరించినట్టు సమాచారం.
కాంగ్రెస్ నాయకులు ఇంటికి వచ్చి భయపెట్టడం, ఎస్సై ఫోన్ చేసి బెదిరించడం వంటి విషయాల ను సైతం రమేశ్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశా డు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు ఎస్సైకి చెప్పడంతో ఆయన సిబ్బందిని పంపించారు. వారు రమేశ్ సెల్‌ఫోన్‌ను గుంజుకొని ‘ఉదయం పోలీస్ స్టేషన్‌కు రా’ అని చెప్పి వెళ్లిపోయారని తెలిసింది. ఒకవైపు కాంగ్రెస్ నాయకులు, మరోవైపు పోలీసులు సృష్టించిన భయోత్పాతానికి ఏంచేయాలో తెలియక రమేశ్ బుధవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు.
ఈ దారుణాన్ని కప్పి పుచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. రమేశ్ మరణించాడని తెలియగానే కాంగ్రెస్ నేతలు రమేశ్‌కు, తమ మధ్య జరిగిన సంభాషణలను చల్వాయి సమాచారం గ్రూప్ నుంచి డిలీట్ (డిలీట్ ఫర్ ఎవ్రీవన్) చేశారు. మరోవైపు బుధవారం రాత్రి సెల్‌ఫోన్ గుంజుకుపోయిన పోలీసులు, గురువారం ఉదయాన్నే రమేశ్ ఇంటికి వచ్చి మంచం కింద ఫోన్పడేసి వెళ్లినట్టు సమాచారం. రమేశ్ మరణంపై చల్వాయి గ్రామం మండిపడింది. తల్లిదండ్రులు లేని అమాయక యువకుడిని పొట్టన పెట్టుకున్నారంటూ గ్రామప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధువులు, స్నేహితులు రమేశ్ మృతదేహంతో జాతీయ రహదారి (నెంబర్ 163)పై ధర్నా చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. యువకుడి మృతికి కారణం ఎవరో చెప్పాలని పట్టుబట్టారు.
ఎవరి ఫిర్యాదుతో రమేశ్‌ను పోలీసులు బెదిరించి, అతని సెల్‌ఫోన్ లాక్కెళ్లారని ప్రశ్నించారు. ఉరివేసుకుని చనిపోయేంతగా బెదిరింపులకు పాల్పడినవారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇల్లు అడిగినందుకు ‘ఇల్లు నీకెందుకురా? ఒంటరి వాడికి ఇల్లు అవసరమా? అనాథకు ఇల్లు అవసరమా? అని సూటిపోటి మాటలతో రమేశ్‌ను మానసికంగా కుంగదీసి, చివరకు ఇలా ఉరిపోసుకొని చనిపోయేలా చేస్తా రా? ఇదెక్కడి అన్యాయం?’ అంటూ గ్రామస్థులు మండిపడ్డారు. గ్రామస్థుల ఆందోళనతో 3 గంటలపాటు హైవే స్తంభించింది. పోలీసులు సర్దిచెప్పేందుకు రాగా, గ్రామస్థులకు వాగ్వాదం జరిగింది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారి అదుపు తప్పే అవకాశం ఉందని భారీ ఎత్తున పోలీసు బలగాలు చల్వాయిలో మోహరించాయి. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు చల్వాయికి చేరుకొని, బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశాయి. పోలీసులు చివరికి మృతుడి అమ్మమ్మ శెట్టి విశాల ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం మృతదేహాన్ని ములుగు దవాఖానకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. నలుగురిపై కేసులు నమోదు చేసినట్టు డీఎస్పీ రవీందర్ తెలిపారు.
ఇందులో చల్వాయి సమాచారం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కూడా ఉన్నట్టు తెలిపారు. ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి దవాఖానకు చేరుకొని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యేనని, రమేశ్ మృతికి కారణమైన నేతతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.