హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించి వారికి క్యాబినెట్ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ దాఖలుచేసిన ప్రజాహిత వ్యాజ్యానికి నంబర్ కేటాయించాలని హైకోర్టు.. రిజిస్ట్రీకి ఉత్తర్వులు జారీచేసింది. పిల్‌కు నంబర్ కేటాయించకుండా గతంలో రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఇదే అంశంపై ప్రతిపక్షంలో ఉండగా నేటి సీఎం రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌తో కలిపి దీనిని కూడా విచారిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ దాఖలుచేసిన పిల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
కాంగ్రెస్ పార్టీ నేతలు కే కేశవరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, పీ సుదర్శన్‌రెడ్డి, కే ప్రేమ్‌సాగర్, జీ చిన్నారెడ్డి, నరేందర్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, హెచ్ వేణుగోపాల్‌రావు, ఆదిత్యనాథ్, ఏపీ జితేందర్‌రెడ్డి, మల్లు రవి, కే శ్రీనివాసరాజు, ఎస్ ప్రసన్నకుమార్, కే పెంటారెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి క్యాబినెట్ హోదా ఇవ్వడం చట్టవిరుద్ధమని సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, న్యాయవాది రామవరపు చంద్రశేఖర్‌రెడ్డి వాదించారు. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. రాజ్యాంగంలోని అధికరణ 164(1ఏ) ప్రకారం ప్రభుత్వ నిర్ణయం చెల్లదని అన్నారు. ఈ అధికరణం కింద శాసనసభలోని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో 15 శాతం మాత్రమే క్యాబినెట్ హోదా ఉండాలని, అయితే మంత్రివర్గంలో 16 మంది మంత్రులున్నారని చెప్పారు.
తాజాగా క్యాబినెట్లో చేరిన మహమ్మద్ అజారుద్దీన్‌తో కలిపితే ఆ సంఖ్య 16కు చేరిందని, ఇది రాజ్యాంగంలోని 164(ఏ) అధికరణాన్ని ఉల్లంఘనగా ప్రకటించాలని కోరారు. ముఖ్యమంత్రి, మంత్రులకు మాత్రమే క్యాబినెట్ హోదా ఉండాలని, ప్రభుత్వానికి ఇష్టమైనవాళ్లకు, రాజకీయ అవసరాల కోసం ఇతరులకు కూడా క్యాబినెట్ హోదా కల్పించడం రాజ్యాంగం ప్రకారం చెల్లదని చెప్పారు. తమకు నచ్చినవారికి క్యాబినెట్ హోదా ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరారు.
ఇదేతరహాలో గత ప్రభుత్వంలో జరిగితే సవాల్ చేసిన రేవంత్‌రెడ్డి సీఎం పగ్గాలు అందుకోగానే అందుకు విరుద్ధంగా నియామక పత్రాలు అందజేయడం దారుణమని అన్నారు. పిల్‌కు రిజిస్ట్రీ నంబర్ కేటాయించాలని, ఇదే తరహా పిల్ గతంలోనే ఉందని గుర్తుచేశారు. రిజిస్ట్రీ అభ్యంతరాలను కొట్టివేయాలని, నంబర్ కేటాయింపునకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనలపై స్పందించిన ధర్మాసనం.. రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చింది. పిల్‌కు నంబరు కేటాయించాలని ఆదేశించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్యాబినెట్ హోదాను కల్పించడాన్ని సవాలు చేస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి 2017లో దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంతో కలిపి విచారణ చేస్తామని ప్రకటించింది. తదుపరి విచారణను వచ్చే వారం చేపడతామని వెల్లడించింది.