Congress | రాష్ట్ర కాంగ్రెస్‌లో వివాదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. మండల కమిటీల రచ్చతో గాంధీభవన్‌లో మూడు రోజులుగా ధర్నాలు కొనసాగుతుండగా.. తాజాగా బీసీ నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీలో తమకు అన్యాయం జరుగుతుండటంపై పొన్నాల, వీహెచ్‌లాంటి సీనియర్లతోపాటు పలువురు బీసీ నేతలు బలంగా గొంతెత్తుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 45సీట్లు బీసీలకు కేటాయించాలని, లేదంటే తామేంటో చూపుతామని వారు అధిష్ఠానాన్ని హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ బీసీలను పక్కనవెడుతున్నదా? ఓ వర్గం నేతలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నదా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నది. పార్టీలో తమకు ప్రాధాన్యం కరువైపోతున్నదంటూ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య, వీ హన్మంతరావు సహా ఇతర నేతలు ఇటీవల బాహాటంగానే గళమెత్తారు. ఇప్పుడు వారికి మరికొందరు బీసీ నేతలు తోడయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీసీ నేతలకు 45 సీట్లు ఇవ్వాల్సిందేనని, లేదంటే తామేంటో నిరూపిస్తామని అధిష్ఠానానికి హెచ్చరికలు జారీ చేశారు.
బీసీ నేతలను పట్టించుకోకుంటే రాష్ట్రంలో పార్టీ ఖతమేనని తెగేసి చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బీసీ నేతలు ప్రత్యేకంగా సమావేశయ్యారు. పార్టీలో బీసీలకు ప్రాధాన్యం దక్కడం లేదని, దీనిపై అటోఇటో తేల్చుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఇటీవల పొన్నాల కూడా బీసీ నేతలతో సమావేశమై ఓ వర్గం వారికే పార్టీలో ప్రాధాన్యం లభిస్తున్నదంటూ తన ఆవేదన వెళ్లగక్కారు. అంతేకాదు, ఆ వర్గం నేతల పేర్లు కూడా వెల్లడించారు. పార్టీలో బీసీ నేతల వివాదం రోజురోజుకు ముదురుతుండడంతో ఇది ఎటువైపు దారితీస్తుందోనన్న చర్చ జరుగుతున్నది.
గాంధీ భవన్ వేదికగా ధర్నాలు
ఓ వైపు బీసీ నేతలు అధిష్ఠానానికి వ్యతిరేకంగా ఒక్కటవుతుంటే మరోవైపు మండల కమిటీల ఏర్పాటు పార్టీలో రచ్చకు దారితీసింది. గాంధీభవన్ వేదికగా మూడురోజులు గా కమిటీలకు వ్యతిరేకంగా ధర్నాలు జరుగుతున్నాయి. స్థానిక నేతలను దగ్గరికి తీసుకోకుండా రాష్ట్రస్థాయి, డీసీసీ అధ్యక్షులు వారికి నచ్చిన నేతలను కమిటీలను ఏర్పాటు చేయ డం వివాదానికి కారణమైంది. పార్టీ కోసం శ్రమిస్తున్న నేతలకు వాటిలో స్థానం దక్కకపోవడంతో వారంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కమిటీల ఏర్పాటులో తమ ప్రమే యం లేకుండా, తాము లేకుండా ఎలా వేస్తారంటూ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మునుగోడు కమిటీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పాల్వాయి స్రవంతి ఏకంగా గాంధీ భవన్‌లోనే దీక్షకు దిగారు. డీసీసీ అధ్యక్షుల తీరుకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తున్నారు.
మల్లు రవికి మాణిక్‌రావు ఠాకూర్ హెచ్చరిక
మండల కమిటీల ఏర్పాటులో టీపీసీసీ నేతలు మల్లు రవి, మహేశ్‌గౌడ్ అతి జోక్యంపై నేతలు మండిపడుతున్నారు. పలు కమిటీల్లో ఈ ఇద్దరు నేతలు జోక్యం ఎక్కువైందని, కష్టపడిన నేతలను పక్కనపెట్టి వారికి నచ్చిన వారికి కమిటీల్లో చోటిచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.కమిటీల్లో పేర్లు వారే రాసేసి, ఆ కమిటీలను వారే ఆమోదిస్తూ సంతకాలు పెట్టారని స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి తీరుపై మండిపడుతూ వారిపై ఇప్పటికే పార్టీ ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాకూర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తున్నది. దీంతో ఆయన మల్లురవి, మహేశ్‌గౌడ్‌ను హెచ్చరించినట్టు సమాచారం. అయినప్పటికీ వారు చల్లారడం లేదు. కమిటీల్లో స్థానం దక్కే వరకు ఊరుకునేది లేదని జిల్లా తెగేసి చెబుతున్నారు. ఈ కమిటీల రచ్చ దేనికి దారితీస్తుందోనని పార్టీలో చర్చ జరుగుతున్నది.