Harish Rao | కేసీఆర్ కృషి ఫలితం.. సీతారామా ప్రాజెక్టు, నెర్రెలు బాసిన సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తెలిపారు. నాడు సీతారామ ప్రాజెక్టును వ్యతిరేకించిన కాంగ్రెస్.. అప్పట్లో అనుమతులు రాకుండా కోర్టుల్లో కేసులు వేశారని అన్నారు. కానీ నేడు కాంగ్రెస్ మంత్రులు, నాయకులు మాత్రం గోదావరి జలాల వద్ద ఫోటోలకు ఫోజులిస్తున్నారని విమర్శించారు. తిట్టడం తప్ప.. కట్టడం రాని కాంగ్రెస్‌కు, కేసీఆర్ గొప్పతనం ఇప్పటికైనా అర్థం కావాలని అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఒక్క ఎకరాకు నీరు రాదు అన్నోళ్ళు, ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి హక్కులను కాపాడలేని కాంగ్రెస్ చేతగానితనం వల్ల సాగర్ ఆయకట్టుకు కరువు వచ్చిందని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల రోజుకు పదివేల క్యూసెక్కుల కృష్ణ జలాలను ఆంధ్ర తరలించుకుపోతున్న పరిస్థితి అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో రైతులను ఆదుకునేందుకు ఏకైక మార్గం గోదావరి జలాలను ఒడిసి పట్టి, ఎత్తిపోయడమే అని తెలిపారు. దీన్ని ముందే అంచనా వేసిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని పేర్కొన్నారు.
కేంద్రం కొర్రీలను, కాంగ్రెస్ పార్టీ కుట్రలను ఛేదించి వడివడిగా 90 శాతం పనులు పూర్తి చేశారని హరీశ్‌రావు తెలిపారు. ఇదే కాంగ్రెస్ నేతలు నాడు సీతారామ ప్రాజెక్టే వృథా అన్నారని.. అనుమతులు రాకుండా కోర్టుల్లో కేసులు వేయించారని చెప్పారు. కానీ కేసీఆర్ పట్టుబట్టి న్యాయపరమైన చిక్కులు తొలగించి, అత్యంత క్లిష్టమైన అటవీ పర్యావరణ అనుమతులు సాధించి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయించారని పేర్కొన్నారు. ఆ ఫలితమే నేడు కరువు కోరల్లో చిక్కుకున్న ఖమ్మం జిల్లా రైతులకు వరంగా మారిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి సిద్ధంగా ఉంచిన సీతారామ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తూ అక్కడ ఫోటోలకు మంత్రులు, నాయకులు ఫోజులు ఇస్తున్నారంటే అందుకు కేసీఆర్ ఏ కారణమని తెలిపారు.
కెసిఆర్ కృషి ఫలితం.. సీతారామా ప్రాజెక్టు.
నెర్రెలు బాసిన సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు.
నాడు సీతారామ ప్రాజెక్టును వ్యతిరేకించిన కాంగ్రెస్.
నాడు అనుమతులు రాకుండా కోర్టుల్లో కేసులు.
నేడు గోదావరి జలాల వద్ద ఫోటోలకు ఫోజులిస్తున్న కాంగ్రెస్ మంత్రులు, నాయకులు.
తిట్టడం తప్ప.. కట్టడం… pic.twitter.com/KmCJuPPnpu
— Harish Rao Thanneeru (@BRSHarish) March 5, 2025
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల సాగు, తాగునీటి కష్టాలకు సీతారామ ఒక శాశ్వత పరిష్కార మార్గం అని హరీశ్‌రావు అన్నారు. ప్రత్యక్షంగా ఆరు లక్షల ఎనబై వేల ఎకరాలకు, పరోక్షంగా పది లక్షల ఎకరాలకు సీతారామ ద్వారా గోదావరి జలాలు అందించామని తెలిపారు. సీతారామ ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని నాడు ప్రతిపక్షంలో ఉండి ఇదే కాంగ్రెస్ నాయకులు విమర్శించారని గుర్తుచేశారు. 2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరిందని.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు మీద విషం చిమ్మారని పేర్కొన్నారు. వృథా ప్రాజెక్టు అన్నారని.. ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారని.. డీపీఆర్ లేదని చెప్పారు. ఒకే ఒక్కసారి మంత్రులు బృందం పర్యటించి, 2024 ఆగస్టు15వ తేదీన మూడు పంపు హౌసులను ఏకకాలం స్విచ్ ఆన్ చేసి ప్రాజెక్టును ప్రారంభించారని తెలిపారు.
కేసీఆర్ మొక్కవోని దీక్షముందు కాంగ్రెస్ నేతల ఆరోపణలు పటాపంచలు అయిపోయారని హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కష్టం, నేడు సగౌరవంగా రైతుల ముంగిట నిలబడిందని.. 60 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనకు, పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు తేడాను సుస్పష్టం చేసిందని చెప్పారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే పది లక్షల ఎకరాలకు నీళ్లించే ప్రాజెక్టును ప్రారంభించారంటే… దాని వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఓట్లు, సీట్లు, అధికారం శాశ్వతం కాదని, మనం చేసిన అభివృద్ధే శాశ్వతమని నమ్మే నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. అలా నమ్మి నిర్మించినవే కాళేశ్వరం, సీతరామ ఎత్తిపోతల ప్రాజెక్టులు అని స్పష్టం చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు రైతాంగానికి జీవనాడులై బాసిళ్లుతాయని.. కేసీఆర్ కృషి దశదిశలా చాటుతాయని పేర్కొన్నారు.