సూర్యాపేట టౌన్, జూలై 26: తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల విద్యుత్తుపై కాంగ్రెస్ పార్టీ ధోరణిని ఆ పార్టీ నేతలే ఖండిస్తున్నారని, వాస్తవాలను ఒప్పుకోని కాంగ్రెస్‌లో ఉండలేమని బయటకు వచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్తు చాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనను ఖండిస్తూ సూర్యాపేటకు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత గోపగాని వేణుధర్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బుధవారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్తు చాలని రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన కాంగ్రెస్‌లో పెను దుమారం రేపుతున్నదని అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు నిరంతరంగా ఉండాలన్న బీఆర్ఎస్ నిర్ణయంతో ఏకీభవిస్తూ కాంగ్రెస్ సీనియర్లు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి గులాబీ కండువా కప్పుకొంటున్నట్టు చెప్పారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో గోపగాని వేణుధర్తోపాటు జాటోతు రమేశ్, చింత రవి, నాగభూషణాచారి, ఎల్లయ్య, చిన వెంకన్న, శ్రీను తదితరులు ఉన్నారు.