
నల్లగొండ : టీఆర్ఎస్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లు యర్కచెర్ల నర్సయ్య, లొండ తిరుమలేష్లతో పాటు మొత్తం 150 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారందరినీ పార్టీలోకి ఎమ్మెల్యే భాస్కర్ రావు సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలకు టీఆర్ఎస్ సర్కారు అండగా నిలుస్తోందన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం రూ.100 చెల్లించి సభ్యత్వం పొందిన కార్యకర్తలెవరైనా ప్రమాదవశాత్తూ మృతిచెందితే నామినీకి ప్రభుత్వం రూ.2 లక్షలు అందజేస్తున్నదని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనుల పట్ల యువత ఆకర్షితులవుతున్నారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వాలు ఉన్న పార్టీగా టీఆర్ఎస్ అవతరించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి 60లక్షలకు పైగా సభ్యత్వాలు ఉన్నాయని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని అన్నారు. అమరజీవుల త్యాగాల పునాదులపై టీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. ప్రతీ కార్యకర్త కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని నల్లమోతు భాస్కర్ రావు భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వేములపల్లి మండల పార్టీ అధ్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, యువనేత నల్లమోతు సిద్దార్ధ, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పేరాల కృపాకర్ రావు, ఆమనగల్లు పార్వతి రామలింగేశ్వర దేవాలయ చైర్మన్ వెంకటేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మేక దేవరాజు, మేక రవీందర్, గ్రామ శాఖ అధ్యక్షులు పోల పాపయ్య, తదితరులు పాల్గొన్నారు.