Congress | హైదరాబాద్ సిటీబ్యూరో/ మన్సూరాబాద్, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ): మూసీ ప్రక్షాళన చేద్దాం.. రైతాంగాన్ని ఆదుకుందాం.. అంటూ నాగోల్‌లోని శుభం కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ నేతలు సమావేశం నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి తరలించిన కాంగ్రెస్ నేతలతో ఈ కార్యక్రమం రైతులు లేని నేతల కార్యక్రమంలా మారింది. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అంతా తానై నిర్వహించగా, మూసీ ప్రక్షాళనకు సహకరించాలని చెప్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం కాంగ్రెస్ నేతల్లోనే చర్చకు దారితీసింది. మూసీ ప్రక్షాళనతో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఉపయోగంగా ఉంటుందన్న ఆలోచనను రైతుల్లో కల్పించే దిశగా కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలు అసలు రైతులే రాకపోవడంతో విఫలమయ్యాయి.
రైతుల పేరిట కాంగ్రెస్ నేతలు
మూసీ ప్రక్షాళనలో రైతులకు బదులు తమ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలను, లోకల్ లీడర్లను తరలించారు. రైతులను తీసుకురావాలనుకున్నా.. వారెవరూ సహకరించకపోవడంతో కార్యక్రమం అభాసుపాలు కాకుండా పార్టీ కార్యకర్తలు, లీడర్లతోనే మమ అనిపించారు. కుర్చీల్లో అందరూ కాంగ్రెస్ నేతలే ఉండడంతో రేవంత్ భజనతో నేతల ప్రసంగాలు కొనసాగాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తారని భావించినప్పటికీ ఆయన ముఖం చాటేశారు. మూసీ ప్రక్షాళనకు అందరూ సహకరించాలని చెబుతున్న కోమటిరెడ్డి సొంత పార్టీ కార్యక్రమం అందునా సొంత జిల్లా నేతలు నిర్వహించిన కార్యక్రమానికి చివరి నిముషంలో హ్యాండిచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకే పెద్దదిక్కుగా భావించే కోమటిరెడ్డి కార్యక్రమానికి రాకపోవడంతో హాజరైన నేతలలో చర్చ జరిగింది. ఉమ్మడి నల్లగొండ కాంగ్రెస్‌లో గ్రూప్ వార్ కొనసాగుతుందని, రేవంత్ భజన చేసే బ్యాచ్‌తో తాను కలవాల్సిన అవసరం లేదని మంత్రి రాలేదని కోమటిరెడ్డి అనుచరులు కొందరు అక్కడికి వచ్చి వెంటనే బయటకు వెళ్లిపోయారు.