హైదరాబాద్ మహా నగరం చుట్టూ చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) రంగులు మార్చుకుంటున్నది. దక్షిణభాగంలో దారి తప్పుతున్నది. గుట్టుగా రూటు మార్చుకుని, బడా నేతల భూముల దగ్గర గీత దాటుతున్నది. గతంలో 189 కిలోమీటర్లు పొడవైన రింగ్‌రోడ్డును 5 కిలోమీటర్లకు పెంచినట్టే పైకి కనపడుతున్నా.. వాస్తవానికి అది అవుట్‌లైన్! ఆ 5 కిలోమీటర్ల పరిధిలో వేల ఎకరాలు రానున్నాయి. ఒక్క గీత వందల ఊర్ల తలరాతను మార్చనున్నది. కొందరు నేతల జేబులు నింపనున్నది. మరెందరినో బజారున పడేయనున్నది. వంకరటింకరగా తిరిగిన ట్రిపుల్ ఆర్ పెద్దోళ్ల డొంకల్లోకి మళ్లింది. అధికార పార్టీ నేతలు ముందుగానే కొని పెట్టుకున్న భూముల కోసమే రోడ్డు మెలిక తిరిగింది. అస్మదీయుల కోసమే అలైన్మెంట్ మారింది. ఇంతకీ ఎవరా బడా నేతలు! ఎవరా రీజినల్ రింగ్ మాస్టర్లు!
RRR | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 18 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగం వంకరలు తిరుగుతున్నది. చడీచప్పుడు లేకుండా తన దిశను మార్చుకుని పేదోళ్ల చేలను చీల్చుకుంటూ.. పెద్దోళ్ల భూముల వైపు కదులుతున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను అష్టవంకరలు తిప్పుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా చేపట్టిన మార్పుల వెనక భారీ కుట్ర కనిపిస్తున్నది.
ప్రభుత్వ పెద్దలతోపాటు కాంగ్రెస్‌కు చెందిన కొందరు నేతలకు వందల ఎకరాలు ఉన్నచోట అలైన్మెంట్లో కీలక మార్పులు జరగడం కలకలం రేపుతున్నది. ఈ నేపథ్యంలో గత అలైన్మెంట్లో సర్కారు భూముల నుంచి వెళ్లిన రింగు రోడ్డు.. ఇప్పుడు సన్న, చిన్నకారు రైతుల కొద్దిపాటి భూములనుంచే పోతున్నది. దీంతో క్షేత్రస్థాయిలో మార్పులకు అనుగుణంగా అధికారులు సర్వే నిర్వహించి, గుర్తులు వేస్తుండటంతో వివిధ గ్రామాల రైతులకు కంటిమీద కునుకు కరువైంది.
‘నమస్తే తెలంగాణ’ బుధవారం ‘రూటు మారిన ట్రిపుల్ ఆర్’ శీర్షికన ప్రచురించిన కథనాన్ని చూసి అనేకమంది రైతులు ఆందోళనతో ఫోన్లు చేశారు. పెద్దోళ్ల భూముల కోసం తమకున్న ఒకటీరెండు ఎకరాలను గుంజుకొని రోడ్డు వేయాలని చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. కొన్నిచోట్ల రైతులు మూకుమ్మడిగా సర్కారు పెద్దలపై దుమ్మెత్తిపోస్తుండగా… మరికొన్నిచోట్ల ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ మహానగరం చుట్టూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే అలైన్మెంట్ దాదాపుగా ఖరారైన ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగంలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఈ మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి… అలైన్మెంట్ ఖరారుకు గుర్తులు కూడా పెట్టారు. దీంతో గతంలో 189 కిలోమీటర్ల పొడవుగా ఉన్న దక్షిణ భాగం రింగురోడ్డు ఐదు కిలోమీటర్లు పెరిగి 194 కిలోమీటర్లకు చేరింది. ముఖ్యంగా ఆమన్‌గల్, చేవెళ్ల ప్రాంతంలోనే దాదాపు 2-5 కిలోమీటర్ల వరకు అలైన్‌మెంట్‌ను అవతలికి జరిగింది.
పాత అలైన్మెంట్లో మార్పులను గుట్టుచపుడు కాకుండా చేయడంతోపాటు.. వాటిని బయటకు చెప్పొద్దంటూ అధికారులకు సైతం హుకుం జారీ చేశారు. అక్కడంతగా ఏమీ లేకపోతే.. ఎందుకీ గోప్యత? ఈ క్రమంలో పలుచోట్ల అలైన్మెంట్ మార్పు వల్ల ఎవరికి ప్రయోజనం జరిగిందనే దానిపై ‘నమస్తే తెలంగాణ’ సమాచారం సేకరించింది. వందల ఎకరాల ప్రభుత్వ, కాంగ్రెస్ పెద్దల భూములకు ప్రయోజనం చేకూర్చేందుకే ‘రింగు’ తిరిగినట్లుగా తెలుస్తున్నది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ట్రిపుల్ ఆర్ ప్రతిపాదన ఉన్నా.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఆది నుంచీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు నిర్ణయించిన దరిమిలా గతంలోనే మోదీ సర్కారు భారత్‌మాల కింద ప్రాజెక్టును ప్రకటించింది. అందుకు అనుగుణంగా ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగం అలైన్మెంట్ నిర్ధారణ, భూసేకరణ, టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. కానీ ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం ట్రిపుల్ఆర్ దక్షిణ భాగాన్ని మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వపరంగానే చేపట్టేందుకు అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
భూసేకరణ సహా ఈ ప్రాజెక్టుకు అటుఇటుగా రూ.15 వేల కోట్ల వరకు అవుతుందని అంచనా. ఈ మేరకు ప్రపంచబ్యాంకు రుణం తీసుకుని పీపీపీ విధానంలో చేపట్టాలని భావిస్తున్నట్టు ప్రాథమికంగా తెలుస్తున్నది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలి. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా అలైన్మెంట్ మార్చేందుకు కేంద్రం అంగీకరించదు. పైగా ఒక్కసారి కేంద్రం అలైన్‌మెంట్‌ను ఆమోదించిన తర్వాత తదుపరి మార్చేందుకు కూడా అవకాశం ఉండదు.
అందుకే ఈ అలైన్మెంట్ల మార్పు తన ఇష్టానుసారంగా చేసేందుకే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తున్నది. తద్వారా తమకు నచ్చినట్లుగా అలైన్మెంట్ మార్చినా నడుస్తుందనేది ప్రభుత్వ పెద్దల యోచనగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కేంద్రం సహకారం తీసుకుంటే పర్యవేక్షణ, అలైన్మెంట్లలో మార్పులోని అసలు గుట్టు బయటపడుతుందనే ఉద్దేశంతోనే ప్రపంచ బ్యాంకు బాట పట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్లలో మార్పులు ఇంతటితో ఐపోలేదు. మున్ముందు మరిన్ని మార్పులు చేర్పులు ఉండనున్నట్టు స్పష్టమవుతున్నది.
ఈ అలైన్మెంట్ మార్పులో కీలకంగా చేవెళ్ల సమీపంలో నుంచి మన్నెగూడ సమీపంలోకి మార్చడం వల్ల మరికొంతమంది ప్రభుత్వ, కాంగ్రెస్ పెద్దల భూములకు ప్రయోజనం కలుగుతుందనేది సుస్పష్టం. ఇందుకు పూడూరు కేంద్రంగా ఉన్న ల్యాండ్ బ్యాంకే నిదర్శనం. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్, అనేకపర్యాయాలు మంత్రిగా చేసిన ఓ నేత, వికారాబాద్ జిల్లాకు చెందిన ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే, ఇటీవల కూతురుతో సహా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఒక మాజీ ఎంపీ, నల్గొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక మంత్రి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఒక ఎమ్మెల్సీకి చెందిన భూములు భారీ ఎత్తున ఉన్నట్టు తెలిసింది.
రంగారెడ్డి జిల్లా అమన్‌గల్ నుంచి మాడ్గుల వరకు పాత అలైన్మెంట్లో అత్యంత కీలకమైన మార్పు జరిగింది. గత అలైన్మెంట్.. మాడ్గుల మండలంలోని కొలుకులపల్లి-బ్రాహ్మణపల్లి-నర్సాయిపల్లి-పెద్ద మాడ్గుల-అప్పారెడ్డిపల్లి మీదుగా అమన్‌గల్ మండలంలోని విఠాయిపల్లి నుంచి వెళ్లింది. కానీ తాజా అలైన్మెంట్ మాత్రం మాడ్గుల మండలంలోని అన్నబోయినపల్లి- బ్రాహ్మణపల్లి-నల్లచెరువు-మాడ్గుల-సింగంపల్లి మీదుగా అమన్‌గల్ మండలంలోని మేడిగడ్డ తండా నుంచి వెళ్తుంది. ఇలా పాత దానికి ఇప్పటిదానికి మధ్య 3-4 కిలోమీటర్ల దూరం పెంచారు.
నల్లచెరువు సమీపంలో ప్రభుత్వ ‘పెద్ద’ అత్తగారి కుటుంబానికి చెందిన వారి భూములు పెద్దఎత్తున ఉన్నాయి. ఇవి సుమారు 200 ఎకరాలకు పైబడే ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఈ భూములకు కేవలం కిలోమీటరు లోపు దూరం నుంచే ట్రిపుల్ రహదారి వెళ్లేలా అలైన్మెంట్ మార్పు చేశారు.
రంగారెడ్డి జిల్లా చుక్కాపూర్ సమీపంలో నుంచి ట్రిపుల్ ఆర్ గత అలైన్మెంట్ ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ ఇప్పుడు దానిని 3-4 కిలోమీటర్ల దూరం అవతలికి జరిపారు. తద్వారా కొత్త అలైన్మెంట్ ఖానాపూర్ గ్రామ సమీపంలో నుంచి వెళ్లనుంది.
ఖానాపూర్ గ్రామం ప్రస్తుత ఎమ్మెల్యే స్వగ్రామం. వీరి కుటుంబానికి ఇక్కడ వంద ఎకరాలకు పైబడి భూములు ఉన్నాయి. తద్వారా ఈ భూములకు కిలోమీటరు లోపు దూరం నుంచే ట్రిపుల్ఆర్ వెళుతున్నదని స్థానికులు తెలిపారు.
రంగారెడ్డి-వికారాబాద్ జిల్లా సరిహద్దులో నుంచి పాత అలైన్మెంట్ ప్రకారం రింగు రోడ్డు అంగడిచిట్టంపల్లి- పూలపల్లి-గంగ్వాడ- ముబారక్పూర్ మీదుగా వెళ్లింది. కానీ తాజా మార్పుతో కనకల్-మేడిపల్లి కలాన్-కుత్బుల్లాపూర్-మన్నెగూడ మీదుగా వెళ్లనుంది. ఇక్కడ కూడా 3-5 కిలోమీటర్ల మేర రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్ వైపునకు అలైన్‌మెంట్‌ను మార్చారు.
ఈ ప్రాంతంలోనే కొన్ని నెలలుగా భారీ ఎత్తున భూములు చేతులు మారినట్టు తెలుస్తున్నది. పార్లమెంటు ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్‌కు వెళ్లిన ఒక మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ, మాజీ మంత్రి ఒకరు, ప్రభుత్వ పెద్ద సోదరుడు మరొకరు.. ఇలా ముగ్గురు ఇందులో కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. ఆ క్రమంలోనే అలైన్మెంట్ ఈ భూముల వైపు వచ్చినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా పాత అలైన్మెంట్ ప్రకారమైతే మాజీ ఎంపీ భూముల్లో నుంచి రింగు రోడ్డు వెళ్లేదని, కానీ తాజా మార్పుతో ఆ భూములు సేఫ్ కావడంతోపాటు సమీపంలో నుంచే రింగు రోడ్డు వెళుతుండటంతో వాటికి డిమాండ్ భారీగా పెరగనుందని స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని ఆలూర్ గ్రామ సమీపంలో నుంచి గతంలో ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ తాజా మార్పులతో అది చెంగోముల్ పోలీస్‌స్టేషన్ సమీపంలో నుంచి అంతారం గ్రామ పరిసరాల్లో నుంచి ప్రతిపాదించారు. ఈ మేరకు హద్దును నిర్ధారిస్తూ మార్క్ కూడా వేశారు.
దీనిపై అంతారం గ్రామం భగ్గుమంటున్నది. మాజీ ఎంపీ ఒకరి భూముల ప్రయోజనం కోసమే ఈ మార్పు చేశారంటూ గ్రామస్తులు చెప్తున్నారు. సదరు మాజీ ఎంపీకి ఇక్కడ ఏకంగా నాలుగు వందల ఎకరాలకు పైగా భూములు ఉన్నాయని వారంటున్నారు. గతంలో ఆ భూముల అవతలి వైపు నుంచి అర కిలోమీటరు దూరంలో అలైన్మెంట్ ఉండేదని, ఇప్పుడు భూములకు ఇటువైపు మార్చారని, తన భూమిలో గుంట భూమికీ నష్టం వాటిల్లకుండా పక్కనుంచే అలైన్‌మెంట్‌ను ఖరారు చేయించుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
రీజినల్ రింగ్‌రోడ్డు రూట్ మారిస్తే నా భూమి ఎకరం వరకు రోడ్డులోనే పోతున్నది. ఊరు దగ్గరగా ఉన్నదని నా భూమిలోనే ఇల్లు కట్టుకున్న. ఇప్పుడు పొలం, ఇల్లు రెండూ పోతున్నయ్. ఊరికి ఒకవైపున కరెంట్ హైటెన్షన్ వైర్ పోతున్నది. ఇంకోసైడు ట్రిపుల్ ఆర్ కోసుకుపోతున్నది. మా బాధ ఎవరికి చెప్పుకోవాలె? ఒకవైపు మాజీ ఎంపీ భూములున్నయ్. కోట్లు విలువచేసే విల్లాలు కడుతున్నరు. వాళ్ల భూములు ఇంచుకూడా పోతలేవు. మా జాగలు రోడ్డుపాలవుతున్నయ్. విల్లాలు సల్లంగుండాలె.. పేదోళ్లు మునగాల్నా?
– వెంకటేశ్, రైతు అంతారం
గత ప్రభుత్వంలో రింగ్‌రోడ్డు వేసేందుకు సర్వే చేపట్టిన విధంగానే ఇప్పుడు రోడ్డు వేస్తేనే మాకు మేలు జరుగుతుంది. లేకపోతే మా ఇండ్లతో పాటు భూములు పోతాయి. నాకున్న ఎకరం పొలంతో పాటు ఇల్లు కూడా రోడ్డులో పోయేలా కనిపిస్తున్నది. రూ.కోట్లు విలువ చేసే భూమితో పాటు రూ.లక్షలు ఖర్చు పెట్టి కట్టుకున్న ఇల్లు కూడా రోడ్డులో పోతే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు.
– సురేందర్, రైతు, అంతారం
మాది వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలంలోని పులిమామిడి. మా అన్నదమ్ములకు 14 ఎకరాల భూమి ఉన్నది. గతంలో త్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మా గ్రామానికి పశ్చిమ వైపు నుంచి నిర్ధారించారు. దాని వల్ల రింగు రోడ్డు అంతా ప్రభుత్వ భూమిలోనే జరిగేది. ఏ ఒక్క రైతు కూడా నష్టపోయేవాడు కాదు. కానీ కొత్త అలైన్‌మెంట్‌ను రెండు కిలోమీటర్లు తూర్పు వైపునకు జరిపారు. దీంతో మా పద్నాలుగు ఎకరాల మధ్యలో నుంచి రోడ్డు పోతుంది. అంటే ఉన్న భూమి అంతా రోడ్డుకే పోతే మేం ఏం చేయాలి? మాదే కాదు.. చాలామంది రైతులది ఇదే పరిస్థితి.
– దేవనగరి భూపతిరెడ్డి, పులిమామిడి