నిజామాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నది. మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి మధ్య జరుగుతున్న వర్గ విభేదాలు కాంగ్రెస్ పార్టీ దుస్థితిని తేటతెల్లం చేస్తున్నది. ఓ వైపు పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై పార్టీ ఫిరాయింపుల కత్తి వేలాడుతున్నది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని దేశ అత్యున్నత న్యాయ స్థానం ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణలో జూబ్లీహిల్స్‌తో పాటు 11 స్థానాల్లో ఉప ఎన్నికలు తథ్యమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. బాన్సువాడలో తాజా పరిస్థితులు దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన దుస్థితి ఎదురు కావడం ఖాయంగానే కనిపిస్తున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో బాన్సువాడ నియోజకవర్గం భౌగోళికంగా విస్తరించింది. ఇరు జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలంతా రెండు వర్గాలుగా విడిపోయి నిత్యం కొట్లాటలు, కల్లోలాలతో కస్సుబుస్సుమంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాన్సువాడలో పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. సుప్రీం కోర్టు తీర్పు త్వరలోనే అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం వెలువడే అవకాశాలున్న నేపథ్యంలో రాజకీయం ఆసక్తిగా మారింది.
బాన్సువాడలో రాబోయే ఉపఎన్నిక కాంగ్రెస్‌కు కీలకంగా మారనుంది. ఈ స్థానాన్ని గెలవడం ఎంతో ముఖ్యమైంది. పరస్పర గొడవల మూలంగా ఇప్పటికే కాంగ్రెస్ దుస్థితి అథోగతికి చేరింది. 2023లో బీఆర్ఎస్ జెండాపై గెలిచిన పోచారం చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి ఓటమి చెందారు. ఉపఎన్నికలు ఖాయమైతే తనకే సీటు వస్తుందని పోచారం భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోచారంపై పోరాటం చేసి ఓటమి చెందిన తనకే సీటు కావాలంటూ ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గం ఆది నుంచి పట్టుబడుతోంది. బాన్సువాడ నియోజకవర్గంలో తన పట్టును కోల్పోకుండా ఉండేందుకు పోచారానికి ఎదురు తిరిగి పోరాటం చేస్తున్నారు.
ఈ స్థితిలో బాన్సువాడలో రాబోయే ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి రాచ మార్గం ఏర్పడబోతోంది. బాన్సువాడలో కేసీఆర్ ప్రభుత్వంలో అమలు చేసిన వివిధ పథకాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులంతా గులాబీ పార్టీకే తమ మద్దతంటూ చెబుతున్నారు. అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గడిచిన 20 నెలల కాలంలో ఇచ్చిన మాటను అమలు చేయకపోవడంతో ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. ఈ స్థితిలో బాన్సువాడలో ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్‌కు కష్టకాలమే.
బీఆర్ఎస్కు గెలుపు సులువేనని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. పోచారం ఏనుగు వర్గీయుల మధ్య కాసుల బాలరాజు వర్గం సైతం అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ప్రచారం. ప్రస్తుతం ఆగ్రోస్ చైర్మన్‌గా కాసుల బాలరాజు పని చేస్తున్నారు. గతంలో బాన్సువాడ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా మెదిలాడు. రవీందర్ రెడ్డికి సపోర్ట్ చేసి కాంగ్రెస్‌లోనే కొనసాగి రేవంత్ ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్ పదవిని పొందాడు. ఉప ఎన్నికల్లో అవకాశం వస్తే తాను కూడా పోటీ చేస్తానంటూ చెప్పుకుంటున్నట్టుగా నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్నది.
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పోచారం శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది కాలానికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ను వీడి అధికార పార్టీ గూటికి చేరడంతో బాన్సువాడ కాంగ్రెస్‌లో కలహాలు మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డితో విభేధాలు తారస్థాయికి చేరాయి. బాన్సువాడ నుంచి 2023లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపాటుకు గురైన కాసుల బాలరాజు కొద్ది కాలానికే ప్రభుత్వంలో కార్పొరేషన్ పదవిని దక్కించుకున్నాడు.
కాంగ్రెస్‌కు పోచారం వచ్చిన తర్వాత ఇరువురు నేతలు కలిసిపోయారు. పోచారం చేతిలో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి రవీందర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి పోచారం రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏఐసీసీ నేతలకు ఫిర్యాదులు చేశారు. సందర్భం ఏదైనా పోచారం వర్గీయులను నిలదీయడంతో ఘర్షణలు మొదలవుతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా చందూర్‌లో నూతన పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో మంత్రి సీతక్క సమక్షంలో పోచారం, ఏనుగు వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటన కాంగ్రెస్‌లోని అంతర్యుద్ధాన్ని మరోసారి బహిర్గతం చేసింది.