SSC Paper Leak | నల్లగొండ ప్రతినిధి, మార్చి 24 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో షేర్ చేయడం, దానికి సమాధానాలను తయారుచేసి, పంపిణీ చేయడం వెనుక పెద్ద తతంగమే నడిచినట్టు తెలుస్తున్నది. ఇందులో కీలకమైన ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసుకున్న వ్యక్తి చిట్ల ఆకాశ్‌ను పోలీసులు ఏ1గా గుర్తించి అతడితోపాటు మొత్తం 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
నిందితుల్లో ఎక్కువమంది అధికార పార్టీకి చెందిన స్థానిక నేతల అనుచరులే కావడం కలకలం రేపుతున్నది. నిందితుల్లో ఏ1 చిట్ల ఆకాశ్ ఓ ప్రజాప్రతినిధి వద్ద డ్రైవర్‌గా, ఏ3 బండి శ్రీను అధికార పార్టీకి చెందిన ఓ మాజీ సర్పంచ్‌కు డ్రైవర్‌గా ఉన్నట్టు తెలుస్తున్నది.
ఏ4గా ఉన్న గుడుగుంట్ల శేఖర్ ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ అధికార పార్టీ నేతల వెంట తిరుగుతుంటాడని సమాచారం. వీరితోపాటు ఏ2గా చిట్ల శివ, ఏ5గా బ్రహ్మదేవర రవిశంకర్, ఏ6 పోగుల శ్రీరాములు, ఏ7 విద్యార్థి తలారి అఖిల్, ఏ8 విద్యార్థి ముత్యాల వంశీ, ఏ9 వ్యాపారి పల్సా అనిల్‌కుమార్, ఏ10 కార్మికుడు పల్లా మనోహర్‌ప్రసాద్, ఏ11గా రాహుల్ ఉన్నారు. ఇందులో ప్రజాప్రతినిధికి ప్రైవేట్ పీఏగా చలామణి అవుతున్న వ్యక్తే ప్రశ్నాపత్రం లీకేజీకి ప్లాన్ వేసినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతున్నది. తన పీఏను కేసు తప్పించేందుకు సదరు నేత పోలీసులపై ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయినట్టు సమాచారం. కాగా, ఓ ప్రైవేటు స్కూల్‌తో భారీ డీల్ మాట్లాడినట్టు తెలుస్తున్నది.
నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి పరీక్షా కేంద్ర చీఫ్ సూపరింటెండెంట్ గోపాల్, డీవో రామ్మోహన్‌రెడ్డి, ఇన్విజిలేటర్ సంధ్యారాణిని విధుల నుంచి తొలిగిస్తున్నట్టు ప్రకటించారు. ప్రశ్నాపత్రం ఫొటోలు తీసేందుకు సహకరించిందని విద్యార్థినిని డిబార్ చేశారు. నిందితులు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడం పోలీసుల వైఫల్యమేనని స్పష్టమవుతున్నది. ఈ ఘటనపై విద్యాశాఖ కమిటీ వేసి నివేదికను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు పంపాలి. కానీ, కమిటీ వేసినట్టు డీఈవో ధ్రువీకరించడం లేదు. అధికార పార్టీ నేతల ఒత్తిడి వల్లే గోప్యత పాటిస్తున్నట్టు తెలుస్తున్నది.