Congress | పెద్దపల్లి, జనవరి 11(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గోదావరిఖనిలో ఆదివారం జరిగిన ఇందిరమ్మ పట్టాల పంపిణీ సభలో ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య ఘర్షణ జరిగింది.
గోదావరిఖనిలో జరిగిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. వీరు కార్యక్రమానికి హాజరై సభపై నుంచి కిందకు దిగిన అనంతరం ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య వేదికపైనే తోపులాట జరిగింది. ఇద్దరు నాయకుల మధ్య మొదలైన వాగ్వాదం ముదిరి ఘర్షణకు దిగింది. సభా వేదికపైనే ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుప్పించుకున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరం నెలకొంది.
గోదావరిఖనిలోని ఒకే డివిజన్‌కు చెందిన ఇద్దరు నాయకుల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. అయితే ఆ గొడవలు ఈ సమావేశంలో బయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరైన వేదికపై ఇలాంటి ప్రవర్తన ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. “ఇదేనా సభా మర్యాదలు..? ఇదేనా మంత్రులకు ఇచ్చే గౌరవం? స్థానిక ఎమ్మెల్యేకు ఇచ్చే విలువ ఇదేనా?” అంటూ పలువురు ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. జిల్లా మంత్రులు పాల్గొన్న సమావేశాల్లో నాయకులు క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. స్టేజీపై ఘర్షణకు దిగడం పార్టీకి ఎంత నష్టం చేస్తుందన్న అంశంపై కూడా చర్చ సాగుతోంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇంత జరిగినా, పలు సంఘటనలు పునరావృతమైనా, సదరు నాయకుడిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. పార్టీ అధిష్టానం, జిల్లా నాయకత్వం ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.