తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కే అధికారం అప్పగించాలనే డిమాండ్ వినిపిస్తున్నది ..
ఔను చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు …
యూపీఏ హయాంలోనే తెలంగాణ వచ్చింది కదా ? వాళ్ళ డిమాండ్ మీద నువ్వేమంటావ్ ?
నేను ఏమంటే ఏముంది? 2014, 2018లో ఇదే డిమాండ్ వినిపించారు, ప్రజలు ఈ డిమాండ్ పై ఏం చెప్పాలో అది చెప్పారు ..
ప్రజలు చెప్పారు, సరే నీ అభిప్రాయం చెప్పు ?
ముందు నేనో కథ చెబుతా అది విన్నాక నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెబితే, నీ ప్రశ్నకు సమాధానం చెబుతా ..
సరే కథ చెప్పు ?
పిల్లా పాపలతో హాయిగా ఉన్న ఓ కుటుంబంలో ఓ దొంగోడు బంగారు గొలుసు ఎత్తు కెళ్ళాడు .. గొలుసు పోయిన బాధలో ఆ కుటుంబం చాలా కాలం నానా యాతన పడ్డది..
ఇక మన గొలుసు దొరకదు… మన నుదిటి రాత ఇంతే … అని తల్లిదండ్రులు బాధల్లోనే జీవితం గడిపారు … పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యాక మన జీవితం ఇలా ఎందుకు ఉందని తల్లిదండ్రులను అడిగారు… వారు పిల్లలకు విషయం చెప్పి మన బంగారు గొలుసు మన వద్ద ఉన్నంత కాలం మన పరిస్థితి బాగానే ఉండేది ..
మన కుటుంబ జీవితం బాగుపడాలంటే గొలుసు మనకు దక్కితేనే సాధ్యం అవుతుంది అని గ్రహించి పిల్లలు గొలుసు కోసం అన్వేషణ మొదలు పెట్టారు ….
చేయి తిరిగిన, పేరు మోసిన దొంగ వద్ద ఆ బంగారు గొలుసు ఉందని గ్రహించిన పిల్లలు దొంగపై యుద్ధం ప్రకటించారు …
ఒకసారి ఎత్తుకొచ్చాను ఇక అంతే దీనిపై సర్వహక్కులు నావే అంటూ వాదిస్తూ వచ్చిన దొంగ చివరి వరకు బంగారు గొలుసు తన వద్దనే ఉంచుకోవడానికి ప్రయత్నించాడు …
ఐనా పట్టు వదలకుండా కలో గంజో తాగి బతుకుతాం, మా గొలుసు మాకు ఇవ్వాల్సిందే అని పట్టు పట్టారు .
గొలుసు ఇవ్వక పోతే ఊపిరి ఆగిపోతుంది అని భయపడి దొంగ గొలుసు ఇచ్చేశాడు …
తల్లిదండ్రులు మొదటి నుంచి నమ్మినట్టుగానే ఆ కుటుంబం చేతికి బంగారు గొలుసు రాగానే ఆ కుటుంబం పచ్చగా కళకళలాడుతున్నది …అలా కొంత కాలం గడిచింది .
నేనిచ్చిన గొలుసు వల్లనే మీ కుటుంబం కళకళ లాడుతున్నది… నేను కాకుండా మరే దొంగ చేతిలో ఉన్నా ఆ గొలుసు మీకు దక్కేది కాదు … గొలుసు నేనే ఇచ్చాను కాబట్టి దాని మీద హక్కులు నావే, ఆ బంగారు గొలుసు తనకు ఇచ్చేయాలని దొంగ డిమాండ్ … చేస్తున్నాడు … అతను చెప్పిన దానిలో కొంత నిజం ఉంది … గొలుసు అతను ఇచ్చింది నిజమే … ఐతే ఆ గొలుసు అతను దొంగతనం చేసింది కూడా నిజమే …
సరే కథ విన్నావు కదా ? ఇప్పుడు చెప్పు ఆ దొంగ వాదనలో న్యాయం ఉన్నదా? బంగారు గొలుసు అతనికి ఇవ్వాలా ? చెప్పు?
ఆ దొంగతో వాదనలు , చర్చలు ఏమిటీ? బంగారు గొలుసు ఎత్తు కెళ్ళి బంగారం లాంటి మా కుటుంబంలో చిచ్చు పెట్టావని అర చేతి వాతలు చెంప మీద వాయించి పంపకుండా ఆలోచిస్తావా ?
ఆ దొంగ వాదనలో న్యాయం ఉందని ఢిల్లీ నుంచి పెద్ద వాళ్ళను తీసుకు వచ్చి చెప్పిస్తున్నారు …ఏం చేయాలి ?
గల్లీ వాడు చెప్పినా , ఢిల్లీ వాడు చెప్పినా దొంగ దొంగే … దొంగతనం చేసిందే తప్పు … ఇంకా హక్కుల గురించి వాదిస్తున్నాడా ?
అంతే అంటావా ?
అంతే …. ఈ మాట చెప్పడానికి మేధావులు అవసరం లేదు ..
ఎవరైనా ఇదే మాట చెబుతారు ….
దొంగ దొంగే
ఐతే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు తెలంగాణ అప్పగించాలి అనే డిమాండ్ కు నా సమాధానం ఇదే …. ఎత్తు కెళ్లిన వారికి అడిగే హక్కు ఉండదు …పైగా ఎత్తు కెళ్ళినందుకు శిక్ష అనుభవించాలి.
– మురళి