తొర్రూరు, డిసెంబర్ 9 : స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్(Congress )నాయకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వెలికట్ట గ్రామంలో ప్రచారం నిర్వహించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాన్ల ఝాన్సీ రెడ్డిని ప్రజలు, సొంత కార్యకర్తలే ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం(,Local body elections) సందర్భంగా గ్రామ మహిళలు సమస్యలను వరుసగా ముందుకు తెచ్చారు.
“నా మనవరాలికి పెళ్లై రెండేళ్లు అవుతోంది. కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇవ్వడం లేదు?” నా మనవరాలకి ఓ కూతురు కూడా పుట్టింది కళ్యాణ లక్ష్మి ఎప్పుడిస్తారని డీకొండ సోమలక్ష్మి ప్రశ్నించగా, మరో వృద్ధురాలు “పెన్షన్ రూ.4,000 ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదు..మా సమస్య ఎవరు చూసుకుంటారు?” అని నిలదీశారు. కాంగ్రెస్ నుంచి రెబల్ అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎవరికి ఓటేయాలో తెలియడం లేదని మహిళలు అసహనం వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల జాడే లేదు..
“ఒకే వార్డులో నలుగురు,ఐదుగురు నిలిస్తే ప్రజలు ఎలా ఓటేయాలి?” అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంతటితో ఆగకుండా, కాంగ్రెస్ పార్టీకి సంవత్సరాలుగా కష్టపడి పనిచేసిన కార్యకర్తలే “పార్టీ కోసం శ్రమించాం..కానీ ఇందిరమ్మ ఇండ్లు మాత్రం ఇవ్వలేదు అంటూ ఝాన్సీ రెడ్డిని నిలదీశారు. అదే సమయంలో ప్రచారం సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు స్థానికుల్లో మరింత ఆగ్రహాన్ని రేకెత్తించాయి. “రెండు సంవత్సరాలుగా గ్రామపంచాయతీలకు సర్పంచులు లేరు.
అసలు ఎన్నికలు నిర్వహించేదే కాంగ్రెస్ ప్రభుత్వమని స్థానికులు ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్పంచ్లను గెలిపిస్తే పోలీస్, రెవెన్యూ శాఖల పనులు సులభంగా అవుతాయి. సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుతాయి. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించకపోతే మీ ఓట్లు చెత్తబుట్టలో పడినట్టే” అని ఝాన్సీ రెడ్డి మాట్లాడిన మాటలకు స్థానికులు ఆశ్చర్యపోయారు. ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోయిన ఝాన్సీ రెడ్డి చివరకు అక్కడి నుండి వెళ్లిపోవడం గ్రామంలో చర్చనీయాంశమైంది.