మహదేవపూర్/భూపాలపల్లి రూరల్, ఏప్రిల్ 15: అది రక్షకభట నిలయం. బాధితులకు భరోసా కేంద్రం. ఎంతో మంది తమ గోడును పోలీసులకు చెప్పుకోడానికి వస్తుంటారు. కానీ, ఆ పోలీస్‌స్టేషన్ ఓ కాంగ్రెస్ నాయకుడికి డ్యాన్స్ క్లబ్‌లా మారింది. వీధిలో రికార్డింగ్ డ్యాన్స్ చేసినట్టు ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే సినిమా పాటలు పెట్టుకొని చిందులేశాడు. వారించాల్సిన పోలీస్ సిబ్బంది కూడా అతడికే వంతపాడారు. రన్నింగ్ కామెంటరీ చేస్తూ.. సెల్ఫోన్లో చిత్రీకరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. ఘటనపై విచారణ జరిపారు. నిర్లక్ష్యం నిజమని తేలడంతో హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయడంతోపాటు ఎస్‌హెచ్‌వోను వెకెన్సీ రిజర్వు (వీఆర్)కు, ఇతర సిబ్బందిని వివిధ స్టేషన్లకు బదిలీ చేశారు. మహదేవపూర్ కాంగ్రెస్ జడ్పీటీసీ సభ్యురాలు గుడాల అరుణ భర్త గుడాల శ్రీనివాస్ సోమవారం వాకింగ్‌కు వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యంలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అక్కడ రిసెప్షన్లో ఉన్న పోలీసులను పలకరించాడు. ఇటీవల శ్రీనివాస్ డ్యాన్స్ చేసిన పలు ఘటనలు ఉదహరిస్తూ అక్కడున్న కానిస్టేబుల్ ప్రశంసించారు. దీంతో హీరో నాగార్జున నటించిన ‘నేనున్నాను’ చిత్రంలోని ‘నన్నేలు మన్మథుడా’ అనే పాటకు చిందులేస్తూ స్టెప్పు లేశాడు. దీనిని అడ్డుకోవాల్సిన అక్కడే ఉన్న పోలీసు డ్యాన్స్‌ను చిత్రీకరిస్తూ వంత పాడాడు.