హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తేతెలంగాణ) : హెచ్‌సీయూ భూములపై మంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షుడు ఎవరికివారు చేస్తున్న ప్రకటనలు విద్యార్థులను అయోమయానికి గురిచేస్తున్నాయి. హెచ్‌సీయూను కంచ గచ్చిబౌలి నుంచి ఫోర్త్‌సిటీకి తరలిస్తామని, అక్కడే భూములు కేటాయించి, భవనాలు నిర్మించి అభివృద్ధి చేస్తామని ఎంపీ మల్లు రవి మీడియాకు తెలిపారు. ఖాళీ భూముల్లో ప్రపంచంలోనే పెద్దదైన ఎకో పార్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయన ప్రకటనను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, భవనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. సోమవారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఎంపీ మల్లు రవిది వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, కోర్టు నిర్ణయం వచ్చే వరకు దానిపై ఏమి వ్యాఖ్యానించవద్దంటూ సమాధానం దాటవేశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియతో చిట్‌చాట్ చేశారు. కంచ గచ్చిబౌలి వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఏదైనా కామెంట్ చేస్తేనే అది ప్రభుత్వ నిర్ణయం అవుతదని, మిగతా వారి మాటలకువిలువలేదని స్పష్టంచేశారు.