Congress | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గుంట మొదలు 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 64,99,323 మంది ఉన్నారు. వీరిలో అత్యధికంగా ఎకరం లోపు రైతులే. అర గుంట నుంచి ఎకరం వరకు ఉన్న రైతుల సంఖ్య 22,55,181 మంది. అంటే మొత్తం రైతుల్లో దాదాపు 35 శాతం అన్నమాట. ఇక ఐదెకరాల వరకు ఉన్న రైతుల సంఖ్య మొత్తం రైతుల్లో ఏకంగా 90 శాతం. దీని ప్రకారం రాష్ట్రంలో ఉన్నది అంతా చిన్న, సన్నకారు రైతులే. ఈ క్రమంలో రాష్ట్రంలో బోర్లు, బావులకు విద్యుత్తు కనెక్షన్ల సంఖ్య దాదాపు 27 లక్షలు. దీని ప్రకారం రాష్ట్రంలో వ్యవసాయానికి కరెంటు సరఫరా అనేది ప్రాణాధారం.
ఒకవైపు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం.. మరోవైపు మిషన్ కాకతీయతో వేలాది చెరువుల పునరుద్ధరణ ఫలితంగా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో భూగర్భజలాల పెరుగుదల సరాసరి దాదాపు ఆరున్నర మీటర్లు. అందుకే బోర్లు, బావుల కింద సన్న, చిన్నకారు రైతులు ఏటా రెండు పంటలను పుష్కలంగా పండిస్తున్నారు. దీంతో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే తెలంగాణ కేవలం తొమ్మిదిన్నరేండ్లలో మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించేస్థాయికి ఎదిగింది. దేశంలోనే పంజాబ్ వంటి రాష్ర్టాన్ని కూడా వెనక్కినెట్టి అన్నపూర్ణగా నిలిచింది.
అవకాశముంటే భూగర్భజలాలకూ కోత!
ఇప్పుడు తెలంగాణ రైతుకు ప్రాణప్రదంగా మారిన 24 గంటల కరెంటు సరఫరాను దెబ్బతీసి, రైతు వెన్నెముక విరిచేందుకు కాంగ్రెస్ సమాయత్తమైంది. కర్ణాటకలో వ్యవసాయానికి ఐదు గంటల విద్యుత్తు చాలు అనే ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను స్ఫూర్తిగా తీసుకున్న ఇక్కడి కాంగ్రెస్ నేతలు, తాము అధికారంలోకి రాగానే మూడు గంటలే ఇస్తామంటూ ఢంకా బజాయించి చెప్తున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు రైతులకు సరైన కరెంటు ఇవ్వకుండా… అర్ధరాత్రి, అపరాత్రి పాముకాట్లు, కరెంటు షాక్‌లతో అన్నదాత ఉసురుతీసిన ఆ పార్టీ ఇన్నేళ్లయినా తన నైజాన్ని మాత్రం మార్చుకోలేదు.
3 గంటల కరెంట్ ఉంటే
3 గంటల కరెంట్‌తో ఎకరం పారదు. అప్పుడు ఎకరానికో బోరు వేయాలి.
ఐదెకరాలున్న రైతు ఐదు బోర్లు వేయాలె. లేకుంటే 4 ఎకరాలు పడావు పెట్టుకోవాలె. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న 58.38 లక్షల మంది తిప్పలు పడాల్సిందే. కాంగ్రెస్‌ను నమ్మితే మళ్లీ పాత కథే.. అన్నదాతకు కన్నీటి వ్యథే.. అందుకే 24 గంటలపాటు కరెంటుతో సాగు సంబురంగానే ఉండాల్నా? 3 గంటల కరెంటుతో భూముల్ని పడావు పెట్టుకోవాల్నా? అనేది రైతులే నిర్ణయించుకోవాలె.
రెండెకరాలున్న రైతు నాలుగైదు బోర్లు వేసినా చుక్కనీరు కనిపియ్యది. ఉన్న దానిలో ఏది నీళ్లెక్కువ పోస్తదో చూసి దానికి మోటరు బిగించుకోవాలె. కరెంటు ఎప్పుడు వస్తదో? ఎప్పుడు పోతదో? తెలియక 24 గంటలు కనిపెట్టుకొని అక్కడనే కూసోవాలె. కరెంటు వస్తే అర్ధరాత్రి… చిమ్మ చీకట్లో కూడా పొలాలకు పోయి చేన్లకు నీళ్లు పెట్టుకోవాలె. దేవుని దయవల్ల పాము కరవక.. కరెంటు షాక్ కొట్టకుంటే రైతు క్షేమంగా ఇంటికొచ్చెటోడు. భూమిల నీళ్లు లేక, సరిగ్గా కరెంటు లేక… ఇంత చేసినా పారేది ఎకరమే. మిగిలిన ఎకరం పడావే.
– ఇదీ రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణలోని రైతుల దుస్థితి
ఐదెకరాలున్న రైతయినా… ఒక్క బోరుతో ఆడుతుపాడుతూ వ్యవసాయం చేస్తున్నాడు. పొద్దుగాల పోయి మోటర్ ఆన్ చేసిండంటే చాలు! ఇతర పనులు చూసుకొని సాయంత్రం వచ్చే సరికి పొలమంతా తడుస్తుంది. ఏదైనా పని ఉండి.. పొద్దుగాల తీరని రైతు సాయంత్రం పోయి మోటరు ఆన్ చేసి, ఇంటికొచ్చిండంటే! మల్ల పొద్దుగాల పోయే సరికి పొలమంతా తడుస్తుంది. భూమిల పుష్కలమైన జల.. రోజంతా కరెంటుతో పొలమంతా పచ్చని కళ.
– తెలంగాణలో 24 గంటల కరెంటు తర్వాత రైతు సుఖమిది