KTR | హైడ్రా అరాచకాలతో హైదరాబాద్ నగర వృద్ధి అతలాకుతలమైందని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా అని ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూలగొడుతున్న హైడ్రా, పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని మండిపడ్డారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కూకట్‌పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ హైడ్రా తన ఇల్లు కూల్చివేస్తుందన్న భయంతో ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల బ్లాక్మెయిల్ దందాల కోసమే హైడ్రా పని చేస్తుందని ఆరోపించారు. పేదవాళ్ల కడుపు కొట్టడం, బిల్డర్లను బెదిరించడం, ఆర్ఆర్ టాక్స్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని ప్రధానమంత్రి స్వయంగా చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు.
బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎన్నడూ రియల్ ఎస్టేట్‌లో నాయకులు వేలు పెట్టలేదని, కబ్జాలు, గూండాగిరి చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ 20 నెలల్లోనే హైడ్రా పేరుతో కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టించారని దుయ్యబట్టారు. కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకోకుండా పేదల ఇళ్లు కూల్చివేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్లలో రెండు లక్షల 85 వేల కోట్ల అప్పు చేస్తే, రేవంత్ రెడ్డి 20 నెలల్లోనే రెండు లక్షల 20 వేల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. కేసీఆర్ ఆ అప్పుతో హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు, అత్యాధునిక ఆసుపత్రులు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు కట్టారని, కానీ రేవంత్ ఒక్క కొత్త బ్రిడ్జి కానీ, మోరీ కానీ కట్టిండా అని ప్రశ్నించారు. కేసీఆర్ 70 లక్షల మంది రైతు ఖాతాల్లో 70 వేల కోట్లు వేస్తే, రెండు లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ ఏం చేశారని నిలదీశారు. 200 ఉన్న పెన్షన్‌ను కేసీఆర్ ప్రభుత్వం 2000 చేస్తే, రేవంత్ ఏం చేసిండని అడిగారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందని కేటీఆర్ అన్నారు. 2014లో గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారని గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం అయిన ఆరు నెలల్లోనే తీవ్ర విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరించి, ఇళ్లలో, షాపుల్లో కనిపించే ఇన్వర్టర్లు, జనరేటర్లను కనిపించకుండా చేశారని చెప్పారు. హైదరాబాద్‌ను కులం, మతం, ప్రాంతం పేరు మీద రాజకీయాలు చేయకుండా, అన్నదమ్ములుగా ఏ పంచాయతీ లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపించామని అన్నారు. హిందూ ఆడబిడ్డలకు దసరా కానుకలు, ముస్లిం పేదలకు రంజాన్ తోఫాలు, క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్టులు ఇచ్చి పండుగలకు ప్రాధాన్యతనిచ్చినట్టు తెలిపారు. తెలంగాణకు గుండెకాయగా హైదరాబాద్‌ను కేసీఆర్ మార్చారని, అందుకే 2023లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్‌కు రాకుండా, మొత్తం గులాబీ జెండాకే నగర ప్రజలు ఓట్లు వేశారని అన్నారు.