ఐనవోలు, డిసెంబర్ 14 : కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిపై కాం గ్రెస్ నాయకులు దాడి చేశారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేల్లో కాంగ్రెస్ అభ్యర్థి కత్తి సుధీర్‌పై బీఆర్ఎస్ అభ్యర్థి ఉస్మాన్అలీ షేక్ 148ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వరుసకు బాబాయి, అబ్బాయిలైన కత్తి సుధీర్ కాంగ్రెస్ అభ్యర్థిగా, కత్తి దేవేందర్ కాంగ్రెస్ రెబల్‌గా పోటీలో ఉన్నారు. వీరిద్దరు కాకుండా బీఆర్ఎస్ అభ్యర్థి ఉస్మాన్అలీ 148 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.
దీంతో పోలింగ్ కేంద్రం నుంచి ఇంటికి వస్తున్న తనపై, తన కుమారుడు, అక్క, కుటుంబ సభ్యులపై సుధీర్, ఎమ్మెల్యే కుమారుడు దిలీప్ దాడి చేయించారని కత్తి దేవేందర్ ఆరోపించాడు. తనపై జరిగిన దాడికి పోలీసులే సాక్షమని దేవేందర్ పేర్కొన్నాడు. తనకు ప్రాణ భయం ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని కోరాడు. విషయం తెలుసుకున్న అతడి అనుచరులు ఘటనా స్థలానికి చేరుకోగానే పరిస్థతి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ విషయంపై ఎస్సైని వివరణ కోరే ప్రయత్నం చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.