మంచిర్యాల, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల మాజీ ఎంపీపీ స్వర్ణలత భర్త, మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్‌పై గురువారం కొంతమంది కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. మండలంలోని రాపల్లిలో రోడ్డుపక్కన కారు నిలిపి తన బంధువుల కోసం శ్రీనివాస్ ఎదురుచూస్తుండగా, అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఒకరు కారును ఢీకొట్టాడు. దీంతో తన కాలు విరిగిందని బైకర్ శ్రీనివాస్‌తో గొడవకు దిగాడు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న తంగళ్ల రాయలింగు, తంగళ్ల సాగర్‌తోపాటు మరికొందరు శ్రీనివాస్‌పై దాడి చేసి గాయపర్చారు. ఇది గమనించిన స్థానికులు శ్రీనివాస్‌ను వైద్యం కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకుని దవాఖానకు వచ్చిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. శ్రీనివాస్‌ను ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్తామని పట్టుబట్టారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. శ్రీనివాస్‌ను ఎక్కడికి తరలించేది లేదని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా పోలీసులు శ్రీనివాస్‌ను బలవంతంగా తీసుకెళ్లారు. శ్రీనివాస్‌ను దవాఖానకు తీసుకెళ్లకుండా శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్‌కు, అక్కడి నుంచి హాజీపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు, కుటుంబ సభ్యులు పోలీసులపై మండిపడ్డారు. చివరకు పోలీసులు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేయగా విమర్శలు తలెత్తాయి.
ఘటనపై శ్రీనివాస్ భార్య, మాజీ ఎంపీపీ స్వర్ణలత మీడియాతో మాట్లాడుతూ.. పక్కా ప్లాన్‌తోనే తన భర్త శ్రీనివాస్‌పై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారన ఆరోపించారు. కావాలనే కారును ఢీకొట్టి ఆ తర్వాత గంగళ్ల రాయలింగు, సాగర్‌తోపాటు పలువురు దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. కాలు విరిగిందని నాటకాలు ఆడినవారు సైతం అప్పటికప్పుడు లేచి తన భర్త పై దాడి చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పిన పోలీసులు స్టేషన్‌కు ఎందుకు తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీనివాస్‌కు ఏం జరిగినా పోలీసులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.