మహబూబ్నగర్, జనవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తన బొలెరో వాహనానికి బీఆర్ఎస్ జెండా కట్టుకున్నాడని ఆ పార్టీ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఈ ఘటన వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని నర్సింగాయపల్లిలో బుధవారం చోటుచేసుకున్నది. ‘ఈ నెల 15న నా బొలెరో వాహనానికి బీఆర్ఎస్ జెండా కట్టుకున్నాను. గ్రామానికి చెందిన ఆంజనేయులు, అతడి కొడుకు హరికృష్ణ.. బొలెరో వాహనానికి ఓడిపోయిన పార్టీ జెండా ఎందుకు కట్టావు అంటూ బూతులు తిట్టారు. బీఆర్ఎస్పై ఇష్టంతో జెండాను కట్టున్నానని చెప్పడంతో నన్ను చితకబాదారు’ అని బాధితుడు కురుమూర్తి వాపోయాడు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన కురుమూర్తి.. ‘కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు చూస్తూ ఉండలేకపోతున్నాను.. ఇల్లు అమ్ముకొని వెళ్తాను.. ఎవరైనా నా ఇల్లు కొనుక్కోవాలి’ అని ప్రాధేయపడుతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. కాగా.. నర్సింగాయపల్లికి చెందిన కురుమూర్తిపై ఆయన మేనమామ దాడి చేసిన మాట వాస్తవమేనని, బొలెరో వాహనంతో బైక్ను ఢీకొట్టినందుకు ఆయనను కొట్టారని ఫిర్యాదు వస్తే.. గ్రామస్థులు ఇరువర్గాల వారికి రాజీ కుదిరించారని గోపాల్పేట ఎస్సై వెంకటేశ్వర్లు ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధికి వివరించారు.