శామీర్‌పేట, ఏప్రిల్ 7: మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా శామీర్‌పేట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులుయాదవ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి వ్యవసాయదారుల సేవా సహకార సంఘంపై దాడికి పాల్పడ్డారు. పదిమందిని వెంటబెట్టుకుని వచ్చి సంఘం భవనంలోని మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటాలను చించివేశారు. అద్దాలకు అంటించి ఉన్న కేసీఆర్, బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన పథకాల స్టిక్కర్స్, ఫ్లెక్సీలు తొలగిస్తూ వీరంగం సృష్టించారు. అడ్డువచ్చిన సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. సహకార సంఘం కార్యాలయంపై దాడి చేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ శామీర్‌పేట్ మండల అధ్యక్షుడు వైఎస్ గౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం రమేశ్, మాజీ ఎంపీటీసీ సాయిబాబు, శామీర్‌పేట్ గ్రామ అధ్యక్షుడు ఆంజనేయులు, యూత్ కాంగ్రెస్ నాయకులు బండి శ్రీకర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, నాగరాజు, కార్యకర్తలు ఉన్నారు.
కాంగ్రెస్ గూండాయిజం మానుకోవాలి
కాంగ్రెస్ నేతలు గూండాయిజాన్ని మానకుంటే ప్రజలే ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయం. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోలేక, బీఆర్ఎస్ నేతల ఎదుగుదలను ఓర్వలేక కక్షసాధింపు చర్యలు, పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలను, ఫ్లెక్సీలను చించినంత మాత్రాన ప్రజల గుండెల్లో ఆయన పట్ల ఉన్న అభిమానాన్ని చెరిపివేయలేరు. ప్రొటోకాల్ ప్రకారమే సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని కూడా కార్యాలయంలో పెట్టాం. సొసైటీ కార్యాలయాన్ని 24 గంటల్లోనే నేలమట్టం చేస్తామని బీరాలు పలుకుతున్న కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే రైతులకు రుణమాఫీ, రైతు భరోసా ఇప్పించాలి. ఈ దాడిపై పోలీసులను సంప్రదించిన ఎలాంటి స్పందన లేదు. దాడికి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే ధర్నాలు చేపడుతాం.