కారేపల్లి(కామేపల్లి), జూన్ 17 : దళిత మహిళలపై విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచిన కాంగ్రెస్ నాయకులపై ఖమ్మం జిల్లా కామేపల్లి పోలీస్స్టేషన్లో మంగళవారం ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామేపల్లి మండల పరిధిలోని పింజమడుగుకు చెందిన చిప్పలపల్లి ఆనంద్పై గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు దాడిచేశారు. ఆనంద్ భార్య ఈశ్వరి, ఇద్దరు కుమార్తెలు కలిసి తన తండ్రిని ఎందుకు కొట్టారని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు.
మమ్మల్నే ప్రశ్నిస్తావా.. అంటూ కాంగ్రెస్ నాయకులు కామేపల్లి సొసైటీ ఉపాధ్యక్షుడు గుజ్జర్లపూడి రాంబాబు, కామేపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దమ్మాలపాటి సత్యనారాయణ మరికొందరితో కలిసి ఆ మహిళలను కులం పేరుతో దూషిస్తూ కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దెబ్బలు తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పటికీ వెంటపడి మరీ కర్రలతో కొట్టారని బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్టు కామేపల్లి ఎస్సై సాయికుమార్ తెలిపారు. గాయపడిన మహిళలను ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్టు వెల్లడించారు.