Bala Krishna | సినీ అభిమానుల మధ్య ఎంత పోటీ, వాగ్వాదాలు ఉన్నప్పటికీ… టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మెగా ఫ్యామిలీ, నందమూరి కుటుంబాల మధ్య మాత్రం అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకంగానే నిలుస్తోంది. స్టార్ హీరోలు చిరంజీవి -నందమూరి బాలకృష్ణ మధ్య ఉన్న స్నేహం తరచూ పలు సందర్భాల్లో బయటపడుతూనే ఉంటుంది. తాజాగా రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించడంతో ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం మరోసారి చర్చకు వచ్చింది.
కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టిన విషయం తెలిసిందే. చిరంజీవి ఎప్పటినుంచో మనవడిని చూడాలని కోరుకుంటుండగా, ఈసారి ఒక బాబు మాత్రమే కాకుండా మరో పాప కూడా పుట్టడంతో మెగా ఫ్యామిలీలో ఆనందం రెట్టింపైంది. ఈ శుభవార్త తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసినట్లు సమాచారం. రామ్ చరణ్ దంపతులకు బాలకృష్ణ తరఫున ఒక అందమైన పూల బొకేతో పాటు శ్రీ వెంకటేశ్వరస్వామి ఫోటో, తిరుమల ప్రసాదం, పిల్లల కోసం కొన్ని బొమ్మలు, గిఫ్ట్ హ్యాంపర్లు పంపినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదే మొదటిసారి కాదు. గతంలో మెగా కుటుంబంలో శుభకార్యాలు జరిగినప్పుడల్లా బాలయ్య నుంచి బహుమతులు చేరిన సందర్భాలు చాలానే ఉన్నాయని అంటున్నారు.
ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక సెంటిమెంట్ కూడా ఉంది. ఏదైనా మంచి పని, శుభకార్యం ముందు నందమూరి బాలకృష్ణ నుంచి ఆశీర్వాదాలు లేదా బహుమతి వస్తే అది మంచి సూచికగా భావిస్తారనే నమ్మకం చాలాకాలంగా ఉంది. అందుకే తనకు ఆప్తులైన వారికి, స్నేహితులకు బాలయ్య స్వయంగా గుర్తుంచుకుని గిఫ్ట్‌లు పంపుతుంటారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోలో బాలకృష్ణ – రామ్ చరణ్ మధ్య కనిపించిన సఖ్యత అప్పట్లో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఫ్యాన్ వార్స్ ఎంత ఉన్నా… స్టార్ కుటుంబాల మధ్య వ్యక్తిగత సంబంధాలు ఎంత బలంగా ఉంటాయో ఆ షో ద్వారా స్పష్టమైంది. ఇక సినిమాల పరంగా చూస్తే చిరంజీవి నటించిన తాజా చిత్రం సంక్రాంతి విన్నర్‌గా నిలవగా, రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇలా మెగా ఫ్యామిలీ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న వేళ, కుటుంబంలో కవల పిల్లల రాకతో ఆనంద వాతావరణం నెలకొంది.