కొడంగల్/పెద్దేముల్, డిసెంబర్ 13 : మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపును జీర్ణించుకోలేని కాంగ్రెస్ వర్గీయులు వికారాబాద్ జిల్లాలోని బొంరాస్‌పేట, పెద్దేముల్ మండలాల్లో దాడులకు పాల్పడ్డారు. బీఆర్ఎస్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. బొంరాస్‌పేట మండలం బోట్లోనితండాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారు గెలుపొందడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు శనివారం ఉదయం దాడికి పాల్పడ్డారు. బోట్లోనితండా పంచాయతీ పరిధిలోని బోట్లోనితండా, పూర్యానాయక్తండా, దేవులానాయక్తండాలకు చెందిన ఇరుపార్టీల కార్యకర్తలు ఒకరి ఇండ్లపై మరొకరు దాడులకు పాల్పడటంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. దాడిలో కొందరికి తీవ్ర గాయాలు కావడంతో దానికి నిరసనగా హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. పోలీసుకు ఫిర్యాదు చేసినా నామమాత్రంగా కేసు నమోదు చేసినట్టు ఆరోపించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇరు పార్టీల నాయకులపై కేసులు నమోదు చేశారు.
పాషాపూర్‌లో పదిమందికిపైగా గాయాలు
పెద్దేముల్ మండలం పాషాపూర్‌లో ఇరు పార్టీల మధ్య జరిగిన గొడవ శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో పాషాపూర్‌లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్‌గా విజయం సాధించడాన్ని జీర్ణించుకోని కాంగ్రెస్ నాయకులు తమపై దాడి చేసినట్టు బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈ దాడిలో ఇరువర్గాలకు చెందిన దాదాపుగా పదిమందికి గాయాలు కావడంతో పెద్దేముల్ ఠాణాలో ఫిర్యాదులు చేసుకున్నారు. పెద్దేముల్ పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.
ఓటు వేయలేదని దివ్యాంగుడిపై దాడి
వెల్దండ, డిసెంబర్ 13 : ఓటు వేయలేదన్న నెపంతో దివ్యాంగుడిపై దాడి చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో చోటుచేసుకున్నది. రాచూర్‌లో సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందాడు. పోలింగ్ సరళిపై సమీక్ష చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక దివ్యాంగుడు ఆంజనేయులు తమ అభ్యర్థికి మద్దతుగా ఓటు వేయలేదని శనివారం నిలదీసి దాడికి పాల్పడగా గాయాలయ్యాయి.