న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో గురువారం జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరిపై ఒకరు దాడులు, దౌర్జన్యాలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ గూండాలు దాడులకు ఒడిగట్టారు. కొన్నిచోట్ల పోలీసులు తమ ప్రతాపం చూపారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం సర్జఖాన్‌పేటలో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కాంగ్రెస్ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలతో మాట్లాడే క్రమంలో అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలికారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై జులుం ప్రదర్శించారు. తప్పు చేసింది కాంగ్రెస్ కార్యకర్తలైతే, తమపై ప్రతాపం చూపడమేమిటని బీఆర్ఎస్ నాయకులు కోస్గి సీఐని ప్రశ్నించారు.
దీంతో గులాబీ కార్యకర్తలే లక్ష్యంగా వారిపై పోలీసులు లాఠీలను ప్రయోగించారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ప్రచారం ముగియడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు గ్రామంలో ఎదురుపడ్డారు. పోటీగా నినాదాలు చేసుకున్నారు. ఈ సమయంలో కత్తులు, రాళ్లతో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ గూండాలు దాడికి దిగారు. ఈ దాడుల్లో బీఆర్ఎస్కు చెందిన సూరారపు బాబు, వంటెపాక వికాస్, బొడ్డుపల్లి సంతోష్‌కు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకొని బైండోవర్ చేశారు. గాయపడిన బీఆర్ఎస్ నాయకులను నకిరేకల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గురువారం పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలోని చర్చి వద్ద దళితుడినైన తన ప్రచార వాహనాన్ని అగ్రకులాలకు చెందిన పలువురు నాయకులు అడ్డుకుని ధ్వంసం చేశారని సర్పంచ్ అభ్యర్థి దుర్గం మహేశ్ తెలిపారు. ప్రచారంరథం డ్రైవర్ కొత్తపల్లి రాజయ్యను కులం పేరుతో దూషిస్తూ వాహనానికి ఉన్న ఫ్లెక్సీని చించి వేసినట్టు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొన్నారు.