హైదరాబాద్, నవంబర్ 15(నమస్తే తెలంగాణ): దారిన వెళ్తున్న బీఆర్ఎస్ (BRS) కార్యకర్తను అడ్డగించి కాంగ్రెస్ (Congress) నాయకులు దాడి చేశారు. దోపిడీకి సైతం పాల్పడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills By-Election) కాంగ్రెస్ గెలిచిన మరునాడే ఈ ఘటన జరగడంతో మున్ముందు కాంగ్రెస్ ఆగడాలను ఇంకెన్ని చూడాలోనని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రహమత్‌నగర్‌కు చెందిన ఎం రాకేశ్ క్రిస్టోఫర్ శనివారం రాత్రి తన ఇంటికి వెళ్తుండగా స్థానిక శాంతి స్కూల్ లైన్ వద్ద అతడిని కొందరు అడ్డుకున్నారు.
వారిలో రాఖీ అనే కాంగ్రెస్ కార్యకర్త బెదిరింపులకు దిగాడు. ‘ఏరా బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నవు కదరా.. ఇప్పుడు కొడితే నిన్నెవరు కాపాడుతార్రా.. నిన్ను చంపుతాం రా’ అంటూ రాకేశ్‌పై పిడిగుద్దులు కురిపించాడు. రాకేశ్ వద్ద ఉన్న రూ.2,500ను బలవంతంగా లాక్కున్నారు. సెల్ ఫోన్‌ను కూడా గుంజుకోడానికి యత్నించారు. విషయం తెలిసి వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్యరావు మధురానగర్ పోలీసులకు సమాచారం ఇచ్చి బాధితుడు రాకేశ్‌ను చికిత్స కోసం ఎస్ఆర్నగర్లోని ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రాకేశ్‌పై దాడి దుర్మార్గం: మేడె
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): దళిత క్రిస్టియన్, బీఆర్ఎస్ నేత రాకేశ్ క్రిస్టోఫర్‌పై కాంగ్రెస్ గుండాల దాడి దుర్మార్గమని ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ ఖండించారు. దళిత క్రిస్టియన్లంటే కాంగ్రెస్‌కు మొదటి నుంచీ చిన్నచూపేనని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన దళిత క్రిస్టియన్లు.. రాకేశ్‌పై దాడి విషయంలో ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దాడికి బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్‌చేసి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.