హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ధాన్యానికి రూ.500 బోనస్‌పై కాంగ్రెస్ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల వరకు సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, ఇతర కీలక నేతలంతా ధాన్యానికి బోనస్ ఇస్తామని ప్రకటనలు గుప్పించారు. తీరా ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని నాలుక మడతేశారు. దీనిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో మళ్లీ నాలుక తిరగేశారు. ఇప్పటికైతే సన్న ధాన్యంతో బోనస్ మొదలు పెట్టినం.. తర్వాత దొడ్డు ధాన్యానికి కూడా ఇస్తామని దిద్దుబాటు ప్రకటనలు చేశారు. ఈ విధంగా పైనుంచి కిందిస్థాయి వరకు మద్దతు ధర, ధాన్యానికి బోనస్‌పై కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలను పరిశీలిస్తే..
మ్యానిఫెస్టోలో…
‘వరి పంటకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తాం. ప్రస్తుతం క్వింటాలుకు రూ. 2,183 మద్దతు ధర ఉండగా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధాన్యానికి క్వింటాలుకు రూ. 2,683 చెల్లిస్తుంది.’ అని ఉన్నది.
2022 మే 6న వరంగల్‌లో నిర్వహించిన సభలో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్‌ను ప్రకటించింది. ఈ సభలో కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించారు.
సీఎం రేవంత్‌రెడ్డి
‘వచ్చే సీజన్ నుంచి ధాన్యానికి రూ. 500 బోనస్ ఇచ్చి సేకరిస్తాం’
-ఏప్రిల్ 15న నారాయణపేట సభలో
‘భద్రాద్రి రామయ్య సాక్షిగా వచ్చే వానకాలం సీజన్ నుంచి వడ్లకు రూ.500 బోనస్ ఇస్తాం’
– ఏప్రిల్ 19న మహబూబాబాద్ సభలో
సన్నవడ్లు పండించే రైతులకు దిగుబడి తగ్గి, ఖర్చు ఎక్కువవుతున్నది. అందుకే రైతులు సన్నాలను సాగు చేస్తలేరు. సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇస్తే రైతులు సన్నాల సాగుకు ముందుకొస్తారు.
– మే 14న విలేకరులతో చిట్‌చాట్‌లో
సన్నవడ్లకు మాత్రమే రూ. 500 బోనస్ ఇవ్వాలని నిర్ణయం.
-మే 20న కేబినెట్ సమావేశంలో
కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి
‘ధాన్యం బోనస్‌పై మేం అన్నదేమిటీ… ఎమ్మెస్పీ(మద్దతు ధర) కన్నా ఏ రైతుకైనా తక్కువ ధర వచ్చి నష్టం జరిగితే వాళ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని చెప్పినం.’
– ఫిబ్రవరి 13న గాంధీభవన్‌లో
‘సన్న వడ్లకే బోనస్ ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడా చెప్పలేదు.’
-మే 17న విలేకరుల సమావేశంలో
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
‘వచ్చే వానాకాలం సీజన్ నుంచి క్వింటా వరి ధాన్యానికి రూ. 500 చొప్పున బోనస్ చెల్లిస్తాం’.
– ఫిబ్రవరి 4న ఓ సమావేశంలో
‘ప్రస్తుతానికి సన్న ధాన్యానికి 500 బోనస్ ప్రకటించినం. దశల వారీగా అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇస్తాం’.
– మే 21న
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్
‘సన్న వడ్లకే రూ. 500 బోనస్ ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడా చెప్పలేదు. సీఎం అనని మాటలను అన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
-మే 17న విలేకరుల సమావేశంలో
పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
‘వచ్చే సీజన్ నుంచి ధాన్యానికి 500 బోనస్ ఇస్తాం. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి కూడా రైతులకు మాట ఇచ్చారు.’
– ఏప్రిల్ 25న
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
దొడ్డు వడ్ల సాగుకు కష్టం తక్కువ, పెట్టుబడి కూడా తక్కువే. దిగుబడి ఎక్కువగా ఉంటుంది.. అదే సన్న వడ్లకు కష్టం ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ ఉంటది. అయినప్పటికీ ప్రభుత్వం సన్నవడ్లను సాగు చేయమని చెప్తున్నది.
-2020 డిసెంబర్ 05
రూ. 500 బోనస్ సన్నవడ్ల రైతులకు ఇవ్వడం వల్ల సన్నాల ఉత్పత్తి పెరిగి అందరికీ సన్నబియ్యం అందుతుంది. అందుకే తొలుత సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నాం.
-2024 మే 22న