Congress | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 21, (నమస్తే తెలంగాణ): దక్షిణాదిలో ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారు. అందులో ఒకటి కర్ణాటక, రెండోది తెలంగాణ. ఎలాగైనా ఈసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకరావాలని కర్ణాటక కాంగ్రెస్ నేతలు జీవన్మరణ పోరాటం చేస్తుండగా, తెలంగాణలో మాత్రం సీఎం సీటు కోసం కొట్టుకుంటున్నారు. అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి హోరాహోరీగా పోరాడుతున్నారంటే అర్థం ఉన్నది. కానీ ఇక్కడ మాత్రం ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా తన్నుకోవడమేమిటని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇకనైనా వీళ్లు మారరా? అని ప్రజలు ఈసడించుకుంటున్నారు. మొన్నటి దాకా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒంటెత్తు పొకడలపై లొల్లి.. నిన్నేమో పార్టీ ఇన్చార్జి ఏకపక్ష వైఖరిపై దుమారం.. ఇప్పుడేమో కౌన్ బనేగా సీఎం పదవిపై తెగని పంచాయితీ మొదలైంది. ‘సీఎం సీటుపై అప్పుడే కుస్తీ ఎందుకు? ఈ మధ్య జరిగిన రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్ దక్కలేదన్న విషయం గుర్తుకు రావడం లేదా? ఒకరంటే ఒకరికి పొసగదు. పార్టీనే గాడిలో పెట్టుకోవడం చేతగాని, వీళ్లకా రాష్ట్రంలో అధికారం కట్టబెట్టేది?’ అని ప్రజలు ఆసహ్యించుకుంటున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేస్తుండగా, మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ‘పీపుల్స్‌మార్చ్’ పేరిట పోటీయాత్ర మొదలుపెట్టారు. మరోవైపు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన మహేశ్వర్‌రెడ్డి కూడా యాత్ర మొదలు పెట్టారు. నీవు ఎట్ల పాదయాత్ర చేస్తావు? అని మహేశ్వర్‌రెడ్డిపై పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేయడంతో, ఆయన ఢిల్లీ వెళ్లి కాషాయ కండువా కప్పుకున్నారు. భట్టి యాత్రకు చెక్ పెట్టేందుకు రేవంత్‌రెడ్డి నిరుద్యోగ దీక్షల పేరిట కార్యక్రమాన్ని ప్రకటించారు. తనకు తెలియకుండా దీక్షలా? అని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గుస్సా కాగానే నల్లగొండ నిరుద్యోగ దీక్షను రద్దు చేశారు. ఇక భట్టి పాదయాత్ర పెద్దపల్లికి చేరుకోగానే ఆ పార్టీలో రెండు గ్రూపులు ఎదురుపడి రక్తాలు కారేవిధంగా కొట్టుకున్నాయి.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్జిగా ఇంతకుముందు మాణిక్కమ్ ఠాగూర్ ఉండేవారు. ఆయన వ్యవహారం వివాదాస్పదంగా మారడంతో అధిష్ఠానం ఆయన స్థానంలో మాణిక్‌రావు ఠాక్రేను నియమించింది. బాధ్యతలు స్వీకరించిన మూడు, నాలుగు నెలలకే తెలంగాణలో పార్టీని బాగుచేయడం తన వల్ల కాదని మాణిక్‌రావు చేతులు ఎత్తివేయగా అధిష్ఠానమే బుజ్జగించి కనీసం ఎన్నికల వరకైనా కొనసాగమని నచ్చజెప్పినట్టు సమాచారం. మొత్తమ్మీద తెలంగాణకు ఏం మేలు చేస్తం? ప్రజలకు ఏమిస్తం? అన్న దానిపై కాకుండా కాంగ్రెస్ నేతల చూపంతా సీఎం కుర్చీపైనే ఉన్నది. వాళ్లు ఇటువంటి వాళ్లని తెలిసే గత రెండు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ‘తగిన మర్యాద’ చేసి వారి స్థానం ఏమిటో చూపించారు. ఇట్లా పదవుల కోసం కొట్లాడుకునే కదా కాంగ్రెస్ నేతలు తెలంగాణను గతంలో సర్వనాశనం చేసింది!
రామాయణంలో పిడకల వేటలా రాష్ట్రంలో కాంగ్రెస్‌లో అధికారంలోకి వస్తే సీఎం సీటు ఎవరిదన్న పంచాయితీ మొదలైంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర మంచిర్యాలకు చేరుకున్న సందర్భంగా నిర్వహించిన బహిరంగసభకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. రేవంత్‌రెడ్డి పాదయాత్రలో కనిపించని నాయకులంతా అక్కడ ప్రత్యక్షమై తమ మద్దతు భట్టి క్రమార్కకేనన్న సంకేతాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేయాలన్న డిమాండ్‌ను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఎంపీ, ఆ పార్టీ ఏఐసీసీ స్పెషల్ ఇన్వైటీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. రేవంత్‌రెడ్డికి చెక్ పెట్టడానికే ఈ నినాదాన్ని కోమటిరెడ్డి తెరపైకి తెచ్చారు. రేవంత్‌రెడ్డిని గతంలో ‘మీరు సీఎం కావాలని అనుకుంటున్నారా?’ అని మీడియా అడిగితే, తన గోల్ అదేనంటూ స్పష్టం చేశారాయన. ఏదీ ఆశించకుండా పని చేయడానికి తానేమీ మఠం నడపడం లేదని కుండబద్దలు కొట్టారు. తాజాగా దళిత సీఎం నినాదాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెరపైకి తీసుకరావడం ద్వారా రేవంత్‌రెడ్డికి గట్టిగా చెక్ పెట్టినట్టేనని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నినాదం వల్ల ఒక్కదెబ్బకు రెండు పిట్లలు రాలినట్టుగా ఉంటుందని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. దళితుడిని సీఎం చేయాలన్న డిమాండ్‌తో రేవంత్‌కు చెక్ పెట్టడం, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు దగ్గర కావడం రెండవది. ఖర్గే దళితుడు కావడంతో దళిత సీఎం డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చలేరని ఈ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
శాసనసభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు భట్టి విక్రమార్క దళిత సామాజిక వర్గానికి చెందినవారే. ఈయనను దృష్టిలో పెట్టుకొనే దళిత సీఎం డిమాండ్‌ను కోమటిరెడ్డి తెరపైకి తెచ్చారని భావిస్తున్నారు. రేవంత్‌రెడ్డి వ్యతిరేక వర్గం భట్టి విక్రమార్కను సీఎం అభ్యర్థిగా ప్రొజెక్టు చేస్తున్నది. గతంలో (2004) సీఎల్పీ నేతగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడిగా డీ శ్రీనివాస్ ఉండగా.. పార్టీ అధిష్ఠానం సీఎల్పీ నేత వైఎస్‌నే సీఎంను చేసిందని భట్టి వర్గం పరోక్షంగా రేవంత్‌రెడ్డి వర్గానికి గుర్తు చేస్తున్నది. ఇప్పటివరకు 15 మంది ముఖ్యమంత్రి రేసులో ఉన్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించడం కొసమెరుపు.