Indiramma Indlu | సిరిసిల్ల రూరల్, మే 18: తనకు చెప్పకుండానే ఇందిరమ్మ ఇల్లు కట్టేందుకు ముగ్గు పోశాడంటూ కాంగ్రెస్ నాయకుడు ఓ లబ్ధిదారుడిపై ఆక్రోశం వెళ్లగక్కాడు. అంతటితో ఆగకుండా బూటు కాలితో తన్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రాళ్లపేటలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రజాపాలనలో భాగంగా రాళ్లపేట పైలట్ గ్రామంగా ఎంపికైంది. గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా, పలువురు నిర్మాణాలు సైతం చేపట్టారు. ఈ క్ర మంలో ఇందిరమ్మ లబ్ధిదారులు ఏది చేయాలన్నా అధికార పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కిషన్‌ను అడిగి చేయాలని, లేనిపక్షంలో లబ్ధిదారులను నానారకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, రోజురోజుకూ అతడి ఆగడాలు ఎక్కువయ్యాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఇదిలావుండగా గ్రామానికి చెందిన బాలసాని శ్రీనివాస్‌గౌడ్‌కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, నిర్మాణానికి ముగ్గు పోసుకున్నాడు. తనకు తెలియకుండా ముగ్గుపోశాడని కాంగ్రెస్ నాయకుడు కిషన్ సదరు లబ్ధిదారుడితో గొడవ పడ్డాడు. ఈ విషయమై గ్రామంలో నలుగురు సమక్షంలో పంచాయితీ నిర్వహించగా.. ఒకరి జోలికి మరొకరు వెళ్లకుండా ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి గ్రామశివారులోని పెద్దమ్మ తల్లి ఆలయ ఆవరణలో హోటల్లో కాంగ్రెస్ నాయకుడు కిషన్ లబ్ధిదారు శ్రీనివాస్‌గౌడ్‌తో గొడవపడ్డాడు. అంతటితో ఆగకుండా శ్రీనివాస్‌గౌడ్‌ను బూటు కాలితో తన్నాడు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో ఆదివారం కిషన్‌పై తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు బాధితుడు శ్రీనివాస్‌గౌడ్ తెలిపాడు. కాగా, దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లబ్ధిదారుడిపై అధికార పార్టీ నాయకుడు దాడికి దిగడం చర్చనీయాంశంగా మారింది.