Telangana Congress | హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేత వంశీచంద్‌రెడ్డి ఇటీవలి కాలంలో ఢిల్లీని వదిలి రాష్ట్రంలో ఎక్కువ సమయం గడపడం గాంధీభవన్‌లో చర్చనీయాంశంగా మారింది. ఏఐసీసీ పదవిలో ఉన్న వంశీచంద్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నారు. నిరుడు లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీచేసి ఓడిపోయిన వంశీచంద్ రాష్ట్రంలో పార్టీ పదవిపై కన్నేసినట్టు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం సీడబ్ల్యూసీ సభ్యునిగా ఉన్న ఆయన హైకమాండ్‌కు సన్నిహితంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఏఐసీసీ ఆఫీస్‌లో కేసీ వేణుగోపాల్ తర్వాత పార్టీ వ్యవహారాలను కూడా చకబెడుతున్నట్టు సమాచారం. అయితే ఆయన ఆకస్మికంగా హస్తినను వదిలిరావడంపతో రాష్ట్రంలో ముఖ్యపాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారని చెప్పుకుంటున్నారు.
ఈ మధ్య కొత్త ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాష్ర్టానికి వచ్చినప్పటి నుంచి వంశీచంద్ హడావుడి మొదలైనట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మీనాక్షితోపాటు పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలలో ఆయన కూడా పాల్గొంటున్నారు. ఇక కొత్త కార్యవర్గంలో స్థానం ఆశిస్తున్న వారికి ఫోన్లుచేసి, వారి బయోడాటాను సేకరించి ఇన్చార్జికి ఇస్తున్నట్టు సమాచారం. దీన్ని ఆసరాగా చేసుకొని నేతలను తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. రాష్ట్ర కార్యవర్గంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అయితే, వంశీచంద్‌రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లోకి రావడాన్ని ముఖ్యమంత్రి వర్గం జీర్ణించుకోవడంలేదని తెలిసింది. ఆయనకు ఇక్కడేం పని అంటూ సీఎం వర్గీయులు విసుక్కుంటున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.