హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తేతెలంగాణ): హైదరాబాద్ అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట భూవివాదంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు విస్మయం కలిగించిందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు చెప్పారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులను ఎవరైనా ఏమైనా అనొచ్చని, కానీ జడ్జిలను ఒక్క మాట అంటే తెల్లవారేసరికి నోటీసులు పంపుతారన్నారు.
న్యాయం అనేది అందరికీ సమానంగా ఉండాలని తెలిపారు. హాజీపూర్ వంటి ఘోరమైన కేసుల్లో ఆరేండ్లు గడిచినా ఇంకా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని, కానీ బతుకమ్మ కుంట విషయంలో కోర్టు ఇంత వేగంగా స్పందించడం ఆశ్యర్యంగా ఉన్నదని పేర్కొన్నారు. బతుకమ్మ కుంటను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని, ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.