కొడకండ్ల, అక్టోబర్ 28 : ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన విషయాన్ని బయటపెట్టిన బీఆర్ఎస్ యూత్ నాయకుడికి కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ‘తొక్కితే పాతాళానికి వెళ్తావ్’ అంటూ బెదిరింపులకు దిగాడు. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన కామన్ వాట్సాప్ గ్రూప్‌లో బీఆర్ఎస్ యూత్ మండల నాయకుడు కుంచం హరీశ్ ఓ పోస్ట్ పెట్టడంతో మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు తనకు ఫోన్ చేసి అంతు చూస్తానంటూ బెదిరించాడని హరీశ్ మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు.
ఆ వివరాలిలా ఉన్నాయి.. మండల కేంద్రంలోని సర్వే నంబర్ 100లో సుమారు 350 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉండగా, అందులో 10 గుంటలు అప్పటి ప్రభుత్వం వీఆర్వోల సంక్షేమ భవనం కోసం కేటాయించింది. ఈ స్థలం కాంగ్రెస్ నాయకుడి ఇంటి పక్కన ఉండటంతో కబ్జాకు యత్నించి, పిల్లర్ గుంతలు తీయడంతో బీఆర్ఎస్ నాయకులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పరదా కట్టి పనులు మొదలు చేపట్టడంతో వాట్సాప్ గ్రూప్‌లో.. ‘రాష్ట్రంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేదు. వీఆర్వోలకు, క్రీడా ప్రాంగణానికి కేటాయించిన భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు’ అంటూ బీఆర్ఎస్ నాయకుడు కుంచం హరీశ్ పోస్ట్ పెట్టాడు. వెంటనే కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి ‘తొక్కితే పాతాళానికి పోతావ్’ అని బెదిరింపులకు పాల్పడ్డారని వీడియోలో పేర్కొన్నాడు.