Shabbir Ali | టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసులపై మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వివరణ ఇచ్చారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతున్నదని.. వైరల్‌గా మారిన ఆడియోలో ఉన్నది తన వీడియో కాదని ఆయన స్పష్టం చేశారు. అది నకిలీ ఆడియో క్లిప్ అని.. ఎవరో కావాలనే సృష్టించిన కల్పితమైన అంశమని తెలిపారు.
తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని షబ్బీర్ అలీ తెలిపారు. క్రమశిక్షణ కమిటీ దీనిపై వివరణ కోరడానికి ముందే.. ఈ దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ.. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సమాజంలో, పార్టీలో తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ఒక ప్లాన్‌తోనే ఈ కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను పార్టీ శ్రేణులు నమ్మవద్దని అన్నారు. కుట్రధారుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను త్వరలోనే బయటపెడతానని చెప్పారు.
మహేశ్ గౌడ్ తనకు సోదరుడిలాంటి వాడు అని షబ్బీర్ అలీ తెలిపారు. అతని గురించి ఎక్కడా తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. కొందరు కావాలనే తమ మధ్య దూరం పెంచేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. 45 ఏళ్లుగా కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నానని.. పార్టీకి నష్టం కలిగించే పనులు ఏ మాత్రం చేయనని స్పష్టం చేశారు.