Revanth Reddy |హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): స్థానికులైన తమను కాద ని.. ఓ ప్యారాచూట్ నాయకుడికి టికెట్ ఇచ్చి.. కుక్కనోట్లో మూతిపెట్టినట్లు కాంగ్రెస్ పెద్దలు, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యవహరించారని మునుగోడు కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి కన్నీటి పర్యంతమయ్యారు. డబ్బులకు తాము అమ్ముడుపోయామని ఓ చిల్లర గ్యాంగ్ ప్రచారం చేస్తున్నదని.. చిల్లర మాటలు మాట్లాడితే చెప్పు తో కొట్టడం వచ్చు.. నాల్క చీరడమూ వచ్చని రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మునుగోడు టికెట్ దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్న స్రవంతి శనివారం తన మద్దతుదార్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగ ఆమె మాట్లాడుతూ.. ‘మాపై తప్పుగా ఒర్లుతున్నరు.. తిప్పి నాలుగు సరుద్దామంటే పార్టీ గుర్తుకొస్తున్నది. పైసల మూటలు మోసుకొచ్చిండని, ఎదుటి వ్యక్తి ఎలాంటోడో తెలియకుండా కుక్క నోట్లో మూతి పెట్టినట్లే టికెటిచ్చిండ్రు. ఉల్టా మమ్మల్ని ఎంగిలి మెతుకులకు ఆశపడ్డరని అంటున్నరు. ఆ మాటలనేముందు అందులో అర్థమేందో తెల్సుకోవాలె. రాజకీయాలకు కొత్తగొచ్చి పార్టీ టికెట్లు కొనుక్కునేటోళ్లు మాట్లాడే మాటలవి. మీరు ధనబలంతోనే రాజకీయం చేస్తమంటే మేము అంగీకరించే పరిస్థితుల్లో లేము’ అంటూ తన బాధను వ్యక్తం చేశారు.