ఖైరతాబాద్, జూన్ 7: ‘రాహుల్‌ను ప్రధాని కాకుండా అడ్డుకున్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఆయనకు కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి.. ఆర్థికంగా ఉన్న ఆయన సామాజికవర్గాలకే ప్రాధాన్యమినిస్తున్నారు’ అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో సీఎం వైఖరిని ఖండించారు. 80 లక్షల జనాభా ఉన్న మాదిగలు, 60 శాతం ఉన్న బీసీలను కాదని ఆయన సామాజికవర్గానికి చెందిన, ఇతర పార్టీల నుంచి వచ్చని వారికే ఏడు పార్లమెంట్ సీట్లు ఇచ్చారని ఆరోపించారు. ఆయన తప్పు డు నిర్ణయాలతో తెలంగాణలో 16 సీట్లు గెలువాల్సిందిపోయి, ఎనిమిదికే సరిపెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. తన స్వస్థలమై న మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుం చి బీజేపీ అభ్యర్ధి డీకే అరుణ గెలిచారని, ఆయన ఎంపీగా గెలిచిన మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందారని, సొంత నియోజకవర్గాలనే కా పాడుకోలేని వ్యక్తి సీఎంగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. బీజేపీకి బీఆర్ఎస్ ఓట్లు వేసి గెలిపించారని రేవంత్‌రెడ్డి అంటున్నారని, అలాంటప్పుడు ఆ పార్టీ పదహారు సీట్లు ఎందుకు గెలువలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు సీట్లు రాకపోవడానికి రేవంతే కారణమని, రాహుల్, సోనియా గుర్తించాలని చెప్పారు.