జగిత్యాల/ జగిత్యాల రూరల్, అక్టోబర్ 22 : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు మారు గంగారెడ్డి(58) మంగళవారం ఉదయం దారుణహత్యకు గురయ్యాడు. స్థానికులు, జగిత్యాల రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగారెడ్డి ఉదయం ద్విచక్రవాహనంపై రోజులానే గ్రామంలోని హోటల్లో టిఫిన్ చేసి తిరిగి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని దుండగుడు కారుతో ఢీకొట్టాడు. కారులోంచి దిగి గంగారెడ్డి ఛాతి, మెడపై కత్తితో దాడిచేశాడు. ఆ తర్వాత కారును అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయాడు. నాలుగు అడుగుల దూరం వెళ్లి మరో కారులో ఎక్కి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో గంగారెడ్డి పడిపోవడాన్ని చూసిన స్థానికులు జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు.
గంగారెడ్డి హత్యకు పాతకక్షలే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలో గంగారెడ్డికి కొందరితో కొంత కాలంగా వైరం ఉన్నదని, ఈ క్రమంలోనే అతడిని హత్యచేసి ఉంటారని గ్రామస్థులు చెప్తున్నారు. గంగారెడ్డికి, అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి మధ్య భూమి వివాదం ఉన్నదని, ఈ విషయంలో పలుసార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్టు తెలిసింది. భూ వివాదం ఉన్న వ్యక్తి తమ్ముడి కొడుకుపై గతంలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కాగా దీని వెనుక గంగారెడ్డి హస్తం ఉన్నదన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే కక్ష పెంచుకున్న నిందితుడు గంగారెడ్డిని ‘నీ చావు ఏనాటికైనా నా చేతిలోనే ఉన్నది’ అని బెదిరించినట్టు గ్రామస్థులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గంగారెడ్డి హత్య విషయం తెలియగానే ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి పాతబస్టాండ్ సమీపంలోని జిల్లా ప్రధాన దవాఖానకు చేరుకున్నారు. విగత జీవిగా పడి ఉన్న తన ప్రధాన ఆనుచరుడిని చూసి చలించిపోయి కన్నీటిపర్యంతమయ్యారు. గంగారెడ్డి హత్య విషయం జగిత్యాలతోపాటు, చుట్టుపక్కల గ్రామాలకు దావనలంలా వ్యాపించడంతో కొద్ది సేపట్లోనే పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు దవాఖానకు తరలివచ్చారు. రాజకీయ కక్షతోనే హత్య జరిగిందని భావించి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నేతృత్వంలో పాతబస్టాండ్ వద్ద 563వ జాతీయ రహదారిపై పెద్దఎత్తున రాస్తారోకో చేశారు. కొన్ని రోజుల నుంచి జాబితాపూర్‌కు చెందిన బత్తిని సంతోష్ అనే యువకుడు గంగారెడ్డిని చంపుతానని సెల్ఫోన్లో బెదిరిస్తున్నాడని, అతడే హత్యచేశాడని గ్రామస్థులు చెప్పడంతో ఆగ్రహానికి లోనయ్యారు. బెదిరింపుల విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యం వల్లే గంగారెడ్డి హత్యకు గురయ్యాడంటూ మండిపడ్డారు. నిందితుడికి కాంగ్రెస్‌లో ఇటీవల చేరిన ఎమ్మెల్యేతో సన్నిహిత సంబంధాలున్నాయని, పోలీసులతో సైతం సత్సంబంధాలు ఉండడం వల్లే రాజకీయ కక్షతోనే ఈ హత్య జరిగిందని ఆరోపించారు.