Jana Reddy | కుందూరు జానారెడ్డి @ పెద్దలు జానారెడ్డి. రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆయనది. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 15 ఏండ్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఇంత పెద్ద ట్రాక్ రికార్డు కలిగిన జానారెడ్డి తన సొంత నియోజకవర్గానికి ఒరగబెట్టింది ఏమిటంటే.. శూన్యం.
తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చి, రాష్ట్ర నాయకున్ని చేసినందుకు నాగార్జున సాగర్ ప్రజలకు ఆయన ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్.. నియోజకవర్గాన్ని గాలికి వదిలేయడమే. నలభై ఏండ్లు జానారెడ్డి చేయలేని అభివృద్ధి పనులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నోముల నర్సింహ్మయ్య, నోముల భగత్ ఈ ఐదేండ్లలో చేసి చూపించారు.
కేసీఆర్ ప్రభుత్వ పాలనలో నాగార్జున సాగర్ రూపురేఖలే మారిపోయాయి. సమస్యలే తప్ప సౌలతులు తెలియని సాగర్ నియోజకవర్గం ఇప్పుడు కొత్త శోభను సంతరించుకున్నది. కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూస్తున్న సాగర్ ప్రజలు ఈసారి కూడా గులాబీ జెండా ఎగరేస్తామంటున్నారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గం 2009కు ముందు చలకుర్తి పేరుతో ఉండేది.1983 నుంచి ఇప్పటివరకు నలభై ఏండ్లలో ముప్ఫై ఏండ్ల పాటు జానారెడ్డి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో అనేక శాఖలకు మంత్రిగా పని చేశారు. కానీ, ఏనాడూ ఆయన నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదు. దీంతో జానారెడ్డి హయాంలో సాగర్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. 1983లో మంత్రి కాగానే ఆయన నియోజకవర్గాన్ని వదిలి హైదరాబాద్‌కు మకాం మార్చారు. అప్పటినుంచి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ పని కావాలన్నా లోకల్ లీడర్లను పట్టుకొని ఓ కారు కిరాయికి మాట్లాడుకొని హైదరాబాద్‌లోని జానారెడ్డి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో క్రమంగా జానారెడ్డిపై సాగర్ ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. దీంతో 2018 ఎన్నికల్లో జానారెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహ్మాయ్యను గెలిపించారు. ఆయన మరణించడంతో 2021లో ఉపఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికలో జానారెడ్డిపై నర్సింహ్మయ్య కుమారుడు నోముల భగత్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. నాలుగు దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలను కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరించింది. తిరుమలగిరి సాగర్‌ను మండలం చేసింది. హాలియా, నందికొండను మున్సిపాలిటీలుగా మార్చి రూ.70 కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పించింది. జానారెడ్డి హయాంలో గాలికొదిలేసిన హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు, నిడమనూరులో కోర్టు ఏర్పాటు, పెద్దవూర మండలంలో వరదకాల్వ నిర్మాణం, తిరుమలగిరి సాగర్ మండలంలో డీ, 8, 9 కెనాల్స్ పరిధిలో ఉన్న 7 వేల ఎకరాలకు లిఫ్ట్ ద్వారా సాగునీరు అందించడం వంటి అనేక సమస్యలను పరిష్కరించింది. తిరుమలగిరి సాగర్ మండలంలో 24,886 ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా నెల్లికల్లు లిఫ్ట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.692 కోట్లతో లిఫ్ట్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గత 50 ఏండ్లుగా ఎన్ఎస్పీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న వారి ఇండ్లను 58, 59 జీఓ కింద క్రమబద్ధీకరించింది. సాగర్‌లో రూ.18 కోట్లతో 100 పడకల దవాఖాన నిర్మాణం, డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. హాలియాలో రూ.3 కోట్లతో 50 పడకల దవాఖాన నిర్మించింది.
నాగార్జున సాగర్ ప్రజలు ఏండ్లుగా అనుభవిస్తున్న సమస్యలను కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరించింది. రూ.108 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇస్తున్నది. రూ.40 కోట్లతో మిషన్ కాకతీయ కింద 230 చెరువులు, కుంటలను బాగుచేయడంతో జలకళ వచ్చింది. భూగర్భ జలాలు పెరిగాయి. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తే బీఆర్ఎస్ కండువా కప్పుకుంటానని జానారెడ్డి నిండు అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వానికి సవాల్ విసిరి మడమతిప్పారు. రాష్ట్రమంతా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడమే కాదు సాగర్ నియోజకవర్గంలోనూ విద్యుత్తు వ్యవస్థను దారిలో పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. రూ.470 కోట్లలో 10 కొత్త విద్యుత్తు సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ వ్యవస్థను మెరుగుపరిచింది. దీంతో లోఓల్టేజీ సమస్య పరిష్కారమయ్యింది. 20 ఏండ్లుగా అసంపూర్తిగా ఉన్న ఏఎంఆర్పీ లోలెవల్ కెనాల్(వరదకాల్వ)ను పూర్తిచేసి 30 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది. రూ.72 కోట్లతో గొప్పగా బుద్ధవనాన్ని నిర్మించడంతో పర్యాటకంగానూ సాగర్ అభివృద్ధి చెందింది.
ఈ ఎన్నికల్లో సాగర్‌లో ఇద్దరు యువ నేతల మధ్య పోటీ నెలకొన్నది. బీఆర్ఎస్ నుంచి మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున జానారెడ్డి తన కుమారుడు జయవీర్‌రెడ్డిని పోటీ చేయిస్తున్నారు. 2018, 2021ల్లో జానారెడ్డిని ఓడించిన సాగర్ ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించారు. నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరగడం, నోముల భగత్ ప్రజలకు అందుబాటులో ఉండటంతో మళ్లీ బీఆర్ఎస్నే గెలిపించాలని సాగర్ ప్రజలు భావిస్తున్నారు.