Congress | హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం ఉన్నది గాంధీ కాంగ్రెస్ కాదని, గాడ్సే కాంగ్రెస్ అని ఇటీవల బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత సంగిశెట్టి జగదీశ్వర్‌రావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పద్మశాలీలకు తీవ్ర అన్యా యం చేసిందని, 9 శాతానికి పైగా ఉన్నా ఒక్క సీటు కూడా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల గురించి గొప్పగా మాట్లాడే రాహుల్‌గాంధీ.. రాష్ట్రంలో బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారో, అందులో ఎన్ని పాతబస్తీలో ఇచ్చారో ఆలోచించాలని చురక అంటించారు. బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా జగదీశ్వర్‌ను ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో పనిచేసిన వారికి కాకుండా 50 మంది పారాచ్యూట్ నేతలకు టికెట్లు ఇచ్చారని తెలిపారు.
రాష్ట్రంలో లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలు పదేండ్ల పాటు కష్టపడ్డారని, కానీ వారికెవ్వరికీ టికెట్లు దక్కలేదని వెల్లడించారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు టీడీపీ, ఇతర పార్టీల నుంచి వచ్చి చేరి పార్టీని టీడీపీ కాంగ్రెస్‌గా మార్చారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఫ్యూడల్ లీడర్లా వ్యవహరిస్తున్నారని, ప్రస్తుతం ఆ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుస్తున్నదని వివరించారు. పార్టీని రేవంత్ రెడ్డి టీడీపీ కాంగ్రెస్‌లా తయారు చేశారని, టికెట్లు ఇవ్వడంలో ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ఎక్కడా అమలు చేయలేదని అన్నారు. మైనంపల్లి, ఉత్తమ్, కోమటిరెడ్డి కుటుంబాలకు రెండు చొప్పున టికెట్లు ఇచ్చారని, పార్టీ సభ్యత్వం లేని వారికీ టికెట్లు ఇచ్చారని మండిపడ్డారు. పాలకుర్తి, నారాయణపేట నియోజకవర్గాల్లో వారి కుటుంబ సభ్యులకే టికెట్లు ఇచ్చారని తెలిపారు.
అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి
‘2001 నుంచి 2006 వరకు రామ్‌విలాస్‌పాశ్వాన్ పార్టీకి తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ సమయంలో ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నా. తెలంగాణ రావటంలో కేసీఆర్‌ది కీలక పాత్ర. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి ఎన్నో పనులు చేశారు. యాదగిరిగుట్ట దేవాలయం, 24 గంటల విద్యుత్తు, రైతుబందు, రైతుబీమా లాంటి పథకాలతో రైతులకు అండగా నిలిచారు. శాంతి భద్రతలు అదుపులో ఉండటంతో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రజలందరు ప్రశాంతంగా ఉన్నారు. హైదరాబాద్‌ను మంత్రి కేటీఆర్ ఐటీ హబ్‌గా మార్చారు. గతంలో నీటిపారుదలశాఖ మంత్రిగా హరీశ్ రావు అహర్నిశలు శ్రమించారు. జిల్లాకో మెడికల్ కాలేజీ, హైదరాబాద్ నలువైపులా 4 సూపర్ స్పెషాలిటీ దవాఖానలను నిర్మిస్తున్నారు’ అని జగదీశ్వర్‌రావు వెల్లడించారు.
తెలంగాణకు కేసీఆర్ అవసరం
‘రాష్ర్టానికి కేసీఆర్ అవసరం. మనం అందరం తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుతం గ్రామాల్లో సంక్షేమ పథకాలను అమలు చేయటం ద్వారా వారు ఖర్చు పెట్టే సామర్థ్యం పెరుగుతున్నది. దీని ద్వారా డబ్బు సర్క్యులేట్ అవుతున్నది. రాష్ట్ర ఆర్థిక శక్తి బలోపేతం అవుతున్నది. సీఎం కేసీఆర్ రైతులు, మహిళలు, విద్యార్థులు, వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా నిలబెట్టారు’ అని జగదీశ్వర్‌రావు పేర్కొన్నారు.