సిరిసిల్ల రూరల్, జూన్ 17: ‘కాంగ్రెస్ నాయకుడు రూ.10 లక్షల విలువైన నా భూమి కబ్జా చేసిండు.. సీఐ, ఎస్సైకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఉల్టా నా మీద నే కేసు పెట్టిన్రు. ఇప్పుడు నాకు ప్లాటు లేదు.. నా బిడ్డ పెండ్లికి ఏమీ మిగల్లేదు. నా చావుకు కాంగ్రెస్ నాయకులే కారణం. నా కుటుంబాన్ని ఆదుకో కేటీఆర్ అన్నా’ అం టూ లేఖ రాసి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మం డలం అంకుసాపూర్కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య సోమవారం గడ్డిమందు తాగగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కుంటయ్యకు భార్య విజయ, కూతుళ్లు భార్గవి (22), దీక్షిత(11) ఉన్నారు. 2019లో ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన సందర్భంగా మద్దతుగా స్థానిక నేతలతో కలిసి హైదరాబాద్కు వెళ్లారు. సోమవారం రాత్రి వరకు కుంటయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కుంటయ్య సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా లోకేషన్ గుర్తించారు. మంగళవారం తెల్లవారుజామున గ్రామశివారులోని పొలం వద్ద అపస్మారకస్థితిలో పడి ఉన్న కుంటయ్యను కుటుంబసభ్యులు సిరిసిల్లలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాయకులు గజభీంకార్ రాజన్న, అక్కరాజు శ్రీనివాస్, అడ్డగట్ల భాస్కర్ తదితరులు దవాఖానకు చేరుకుని కుంటయ్యను పరామర్శించారు. కేటీఆర్ సూచనతో మెరుగైన వైద్యం కోసం ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించగా, చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. తన కూతురు పెండ్లికోసం కొనుగోలు చేసిన భూమిని కబ్జాచేసి తంగళ్లపల్లికి చెందిన గంగ కృష్ణారెడ్డి, మల్యాల నాగరాజు అనే వ్యక్తులు తనను చాలా ఇబ్బందులకు గురి చేసినట్టు కుంటయ్య లేఖలో ప్రస్తావించారు.
కుంటయ్య మృతిపై కేటీఆర్ దిగ్భ్రాంతి
మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లు చూడాలని పార్టీ నేతలకు సూచించారు. అంకుసాపూర్లో బుధవారం కుంటయ్య అంత్యక్రియలకు కేటీఆర్ హాజరు కానున్నారని పార్టీ స్థానిక నేతలు తెలిపారు.