బాన్సువాడ, డిసెంబర్ 25: ఓ వివాహితను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడికి ఆమె భర్త దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పజెప్పిన ఘటన బాన్సువాడలో గురువారం చోసుకున్నది. పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో పనిచేస్తున్న ఓ మహిళను కాంగ్రెస్ నాయకుడు ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రధాన అనుచరుడైన దేవేందర్‌రెడ్డి వేధింపులకు గురిచేస్తున్నాడు. నెలరోజులుగా దేవేందర్‌రెడ్డి వేధింపులు భరించలేక సదరు మహిళ తన భర్తకు విషయం చెప్పింది.
గురువారం కూడా మహిళను దేవేందర్‌రెడ్డి వేధిస్తుండగా ఆమె భర్త అక్కడికి చేరుకొని అతడిని పట్టుకున్నాడు. తీవ్ర ఆగ్రహం చెందిన ఆయన దేవేందర్‌రెడ్డిని దవాఖాన నుంచి నడిరోడ్డుపై చెప్పులతో కొడుతూ పోలీసు స్టేషన్ వరకు తీసుకెళ్లి, పోలీసులకు అప్పగించాడు. బాధితురాలిని, ఆమె భర్తను కాంగ్రెస్ నాయకుడు బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితంలేకపోయింది. సాయంత్రం బాధిత కుటుంబ సభ్యులు పోలీసుస్టేషన్‌కు వెళ్లినట్టు సమాచారం. గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి వర్గంలో పనిచేసిన దేవేందర్‌రెడ్డి ప్రస్తుతం ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నాడు.