మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జడ్చర్ల, నవంబర్ 27 : యాక్సిడెంట్ కేసును పోలీసులు సెటిల్మెంట్ చేయలేదని ఆగ్రహించిన ఓ కాంగ్రెస్ నేత ఏకంగా ఎస్సై, స్టేషన్ రైటర్ కాలర్ పట్టుకోగా.. అడ్డొచ్చిన కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులపై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నేతను అధికార పార్టీ ఎమ్మెల్యే వచ్చి దర్జాగా బయటికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం మదిగట్లకు చెందిన నట్టల చెన్నకేశవులు అనే కాంగ్రెస్ కార్యకర్త జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 16న తన కారులో భూత్పూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా మార్గమధ్యంలో బూరెడ్డిపల్లి శివారులో వెనుక నుంచి ఒక ట్యాంకర్ ఢీ కొట్టింది.
ట్యాంకర్‌ను జడ్చర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ విషయంలో మదిగట్లకు చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు గురువారం జడ్చర్ల పోలీస్ స్టేషన్‌కు చేరుకొన్నారు. ‘సెటిల్మెంట్ చేసి మాకు డబ్బులు ఇప్పియ్యమంటే ఇప్పియ్యవా.. రా’ అని పోలీసు సిబ్బందితో గొడవపడ్డారు. తిరిగి మధ్యాహ్నంకాంగ్రెస్ భూత్పూర్ మండల అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తన అనుచరులతో పీఎస్‌కు వచ్చి స్టేషన్ రైటర్ భీమప్పపై నోరుపారేసుకున్నాడు. ‘ఒరే.. నా.. కొడకా’.. అంటూ దుర్భాషలాడాడు. ‘మా వాళ్లతో ఉదయం ఎక్కువ మాట్లడినవంట’ అని దాడికి పాల్పడ్డాడు.
చాంబర్లో ఉన్న ఎస్సై జయప్రసాద్ వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ‘నీవేంది.. రా?.. అయితే ఏందిరా?’.. అని ఎస్సై గల్లా పట్టి అందరి ముందు దాడికి పాల్పడ్డాడు. అతడి వెంబడి ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎస్సై జయప్రసాద్, రైటర్ భీమప్పలను స్టేషన్లోనే ఇష్టం వచ్చినట్టు చితకబాదినట్టు సిబ్బంది చెప్తున్నారు. సిబ్బంది రాము, కురుమూర్తి అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగలేదు. స్టేషన్లో ఏదో జరుగుతుందని బయటి నుంచి వచ్చినవారు.. విడిపించేందుకు ప్రయత్నించినా శ్రీనివాస్‌రెడ్డి మాత్రం వినలేదు. ‘మీ సంగతి చూస్తా.. నేను కాంగ్రెస్ పార్టీ భూత్పూరు మండల అధ్యక్షుడిని.. మిమ్మలి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫార్మర్ చేయిస్తా’.. అంటూ గట్టిగా బెదిరించాడు. ఓపిక నశించిన పోలీసులు.. అతడిని పట్టుకొని లాకప్‌లోకి తోసేశారు.
వీరంగం సృష్టించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడిని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి వచ్చి తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఎస్సై కాలర్ పట్టుకుని సిబ్బందిపై దాడికి పాల్పడ్డ నేతలను దర్జాగా విడిపించుకుపోవడంతో విస్తుపోయారు. అంతటితో ఆగ పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఫిర్యా దు ఇప్పించడం.. పోలీసుల గురించి ఉన్నతాధికారులు ఆరా తీయకపోవడం గమనార్హం.