AV Ranganath | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్క్ దగ్గరలోనే రంగనాథ్ ఇల్లు ఉందని, అది చెరువు బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని కాంగ్రెస్ బహిష్కృతనేత బక్క జడ్సన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలు బయటపెట్టారు.
ప్రస్తుతం కృష్ణకాంత్ పార్కు ఉన్న ప్రాంతం ఒకప్పుడు పెద్ద చెరువు. చంద్రబాబు హయాంలో చెరువును పూడ్చి పార్కును నిర్మించారు. ఎక్కడైనా చెరువు గట్టున మైసమ్మ గుడి ఉంటుంది. కృష్ణకాంత్ పార్కుకు సమీపంలోని కట్టమైసమ్మ ఆలయమే నిదర్శనం. పెద్ద చెరువు ఆధారాలు హెచ్ఎండీఏ మ్యా ప్లో మనకు కనిపించవు. కానీ వందే ండ్ల క్రితం నాటి మ్యాప్‌లో పెద్ద చెరువు ఆనవాళ్లను బక్క జడ్సన్ బయటపెట్టారు. చెరువు బఫర్ జోన్లో నిర్మించిన ఇంట్లో నివసించడంలేదని రంగనాథ్ నిరూపించుకోగలరా? అని జడ్సన్ ప్రశ్నించారు.
వెంగళరావునగర్‌లో రంగనాథ్ నివసిస్తున్న ఇల్లు పెద్ద చెరువు బఫర్ జోన్లో ఉంది. హైడ్రా పేరుతో రంగనాథ్ అన్యాయంగా పేదల ఇండ్లు కూల్చారు. బాధను చెప్పుకోవడానికి, సామాన్లు తరలించుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదు. రెండు నెలలు కష్టపడి వందేళ్ల నాటి మ్యాప్ సేకరించాను. ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? ప్రజలకు ఓ న్యాయం, సీఎం అన్న తిరుపతిరెడ్డికి మరో న్యాయం ఉంటుందా? హైడ్రా కూల్చివేత బాధితులకు పరిహారం చెల్లించాలి.
– బక్క జడ్సన్, కాంగ్రెస్ బహిష్కృతనేత